ఇంకెంత మందిని బలి తీసుకొంటారు: టీడీపీ, బీజేపీలపై బొత్స ఫైర్

First Published Jul 29, 2018, 12:52 PM IST
Highlights

 తమ ప్రభుత్వంపై ఉన్న అవిశ్వాసం నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ధర్మపోరాట సభలను నిర్వహిస్తున్నాడని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. 

విజయవాడ: తమ ప్రభుత్వంపై ఉన్న అవిశ్వాసం నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ధర్మపోరాట సభలను నిర్వహిస్తున్నాడని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు.  ఏపీలో కార్యకర్త నుండి సీఎం స్థాయి వరకు అవినీతికి పాల్పడుతున్నారని  ఆరోపించారు.

ఆదివారం నాడు ఆయన విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లుగా  బీజేపీతో  కలిసి కాపురం చేసిన టీడీపీ నేతలు  ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తోందని భావించి  బీజేపీతో తెగతెంపులు చేసుకొందన్నారు.

విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని బీజేపీ నేతలు ప్రకటించారని  రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.  ప్రత్యేక హోదా విషయంలో ఇంకా ఎందరు ప్రాణత్యాగం చేసుకోవాలని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.  ప్రత్యేకహోదా  విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రత్యేక హోదా విషయంలో  ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు.

ప్రత్యేక హోదాతో ఏమొస్తోందన్న చంద్రబాబునాయుడు ఎందుకు యూ టర్న్ తీసుకొన్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే ఏపీలో బీజేపీ నేతలకు కూడ పడుతోందన్నారు.

ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేశారని ఆయన చెప్పారు. టీడీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ఏం చేశారో చెప్పాలని ఆయన కోరారు. అవిశ్వాసం పెట్టండి... ఎంపీల మద్దతును కూడగడుతానని చెప్పిన  పవన్ కళ్యాణ్ పారిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు.

కాపులను మోసం చేసే పరిస్థితి లేకనే  కాపు రిజర్వేషన్ విషయమై  జగన్  ఆ రకంగా వ్యాఖ్యలు చేశారని బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు.  టీడీపీ మాదిరిగా  కాపులను మోసం చేయడం జగన్‌కు నచ్చకనే రిజర్వేషన్ విషయం కేంద్రం పరిధిలో ఉందని చెప్పారని ఆయన గుర్తు చేశారు. 

విశాఖలో హుదూద్ తుఫాన్  కారణంగా రెవిన్యూ రికార్డులను మార్చేసి. ... కోట్లాది రూపాయాల విలువైన భూములను టీడీపీ నేతలు, మంత్రులు కబ్జా చేసుకొంటున్నారని బొత్స ఆరోపించారు. పట్టిసీమ మొదలు పంచభూతాలను కూడ టీడీపీ నేతలు పంచుకొని తింటున్నారన్నారు. ఏపీలో బంద్‌లు, ధర్నాలు వద్దన్న  చంద్రబాబునాయుడు.. ఏపీలో ఎందుకు ధర్మపోరాట సభలను నిర్వహిస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 


 

click me!