ఎన్టీఆరే వెన్నుపోటు పొడిచారు, బాబు నా కంటే తెలివైనోడు: నాదెండ్ల

By narsimha lodeFirst Published Feb 20, 2019, 5:10 PM IST
Highlights

ఎన్టీఆరే తనను వెన్నుపోటు పొడిచారని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు ఆరోపించారు. బాలకృష్ణ తీసిన మహా నాయకుడు సినిమాను చూసి ఎవరు విలనో తేల్చాలని ఆయన ప్రజలను కోరారు.

హైదరాబాద్: ఎన్టీఆరే తనను వెన్నుపోటు పొడిచారని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు ఆరోపించారు. బాలకృష్ణ తీసిన మహా నాయకుడు సినిమాను చూసి ఎవరు విలనో తేల్చాలని ఆయన ప్రజలను కోరారు.

బాలకృష్ణ నటించి నిర్మించిన మహానాయకుడు విడుదలౌతున్న సందర్భంగా  ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు నాదెండ్ల భాస్కర్ రావు బుధవారం నాడు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో  ఆయన పలు  విషయాలను వెల్లడించారు.

సినిమా అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా ప్రజలను మభ్య పెట్టి ప్రజల నుండి  డబ్బులను వసూలు చేసేదే సినిమా అని నాదెండ్ల భాస్కర్ రావు అభిప్రాయపడ్డారు. 

ఈ సినిమాలో తనను అవమానకరంగా చూపితే చర్యలు తీసుకొంటామని ఇప్పటికే తాము నోటీసులు ఇచ్చామన్నారు. కానీ, సెన్సార్ బోర్డు సభ్యులు కూడ తమ అభిప్రాయాలను కూడ పట్టించుకోలేదన్నారు.

తాను ముఖ్యమంత్రిగా ఎన్నికైన సందర్భంలో తనకు మద్దతిచ్చిన వారితోనే గవర్నర్ వద్ద పేరేడ్ చేయించినట్టు చెప్పారు. ఎమ్మెల్యేలు కాని వారు ఎవరూ కూడ గవర్నర్ వద్దకు రాలేదని నాదెండ్ల భాస్కర్ రావు గుర్తు చేసుకొన్నారు. ఎమ్మెల్యేలుగా కాని వారు ఎవరూ కూడ గవర్నర్ వద్దకు రాలేదన్నారు. ఒకవేళ వచ్చినట్టు ఎవరైనా రుజువు చేయాలని  ఆయన సవాల్ విసిరారు.

టీడీపీలో తనను చేర్చుకోవాలని చంద్రబాబునాయుడు తన వద్దకు వచ్చి అడిగాడని నాదెండ్ల భాస్కర్ రావు చెప్పారు. కానీ, అప్పటికే టీడీపీకి ఎన్టీఆర్ అధ్యక్షుడుగా ఉన్నాడని  చెప్పారు.  అధ్యక్షుడుగా ఉన్న ఎన్టీఆర్‌ వద్దకు వెళ్లి ఈ విషయమై అడగాలని తాను బాబుకు సూచించానని చెప్పారు. చంద్రబాబునాయుడు నా కంటే తెలివి కలవాడన్నారు.

అడ్మినిస్ట్రేషన్‌ను తనను చూసుకోవాలని ఎన్టీఆరే తనకు చెప్పారని నాదెండ్ల గుర్తు చేసుకొన్నారు. ఆ ప్రకారంగానే తాను వ్యవహరించినట్టుగా నాదెండ్ల చెప్పారు. ప్రజలంతా ఎన్టీఆర్ వెంట ఉన్నందునే తానే సీఎంగా  ఆయనను ప్రతిపాదించినట్టు చెప్పారు.

 చంద్రబాబునాయుడును హీరో చేసేందుకుగాను ఈ సినిమాను తీశారన్నారు. ఎన్టీఆర్ ఒంటెత్తు పోకడలు, అడ్మినిస్ట్రేషన్ తెలియకపోవడం.. అహంకారం పెరిగిపోవడం వల్ల  తాను కూడ ఎన్టీఆర్‌కు దూరం కావాల్సి వచ్చిందని  నాదెండ్ల చెప్పారు.

 ఎన్టీఆర్ ‌ను  ముఖ్యమంత్రి పదవి నుండి దింపే విషయంలో కాంగ్రెస్ పార్టీ తెర వెనుక పనిచేసిందనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.ఎన్టీఆర్‌ను గద్దెదించడంలో నాదెండ్ల భాస్కర్ రావు పాత్ర ఉందని చెప్పే ప్రయత్నంలోనే ఈ సినిమా తీశారని చెప్పారు. వచ్చే ఎన్నికల కోసమే ఈ సినిమాను తీశారని ఆయన అభిప్రాయపడ్డారు.

పక్షవాతం వచ్చిన ఎన్టీఆర్‌ మళ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసి ఆ పార్టీ విజయం సాధించడంలో లక్ష్మీపార్వతి కీలకంగా వ్యవహరించిందన్నారు. లక్ష్మీపార్వతి విషయంలో అన్యాయంగా తాను మాట్లాడనని చెప్పారు.

1984లో తాను ఎన్టీఆర్‌ను ఉద్దేశ్యపూర్వకంగా గద్దె దించలేదని నాదెండ్ల భాస్కర్ రావు చెప్పారు. ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేలంతా తమ నాయకుడిగా నన్ను ఎన్నుకొన్నారని ఆయన చెప్పారు. కానీ, చంద్రబాబునాయుడు విషయంలో మొదటి నుండి కుట్ర చోటు చేసుకొందని ఆయన ఆరోపించారు.

పార్టీని రక్షించుకొనే క్రమంలో  ఎన్టీఆర్‌ను గద్దె దించినట్టు బాబు చెప్పడం ఆయన అభిప్రాయంగా చెప్పొచ్చన్నారు.  లక్ష్మీపార్వతి పార్టీని ఎక్కడకు తీసుకుపోతోందని ఆయన చమత్కరించారు. తాను మోడీకి మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. మహా నాయకుడు సినిమాను  తాను చూడబోనన్నారు. ఈ సినిమాను చూసీ  ఎవరు విలనో ప్రజలే డిసైడ్  చేయాలని నాదెండ్ల భాస్కర్ రావు  కోరారు.


 

click me!