Breaking: మాజీ ఎంపీ కన్నుమూత

Published : May 13, 2025, 06:13 AM IST
Breaking: మాజీ ఎంపీ కన్నుమూత

సారాంశం

అనంతపురం మాజీ ఎంపీ దరూరు పుల్లయ్య గుండెపోటుతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు 14న బళ్లారిలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.

అనంతపురం జిల్లాకు చెందిన మాజీ లోక్‌సభ సభ్యుడు దరూరు పుల్లయ్య సోమవారం ఉదయం ఆకస్మికంగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు. గత కొంతకాలంగా కుటుంబంతో కలిసి బళ్లారి నగరంలోని తన స్వగృహమైన దరూరు పుల్లయ్య కాంపౌండ్‌లో నివసిస్తున్నారు.

తాజాగా సోమవారం ఉదయం తనకు చెందిన పొలాన్ని పరిశీలించేందుకు బళ్లారి నుంచి కంప్లి కొట్టాల వద్దకు కారులో వెళ్లారు. పొలం పరిశీలించిన తర్వాత తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన ఉన్న తన స్నేహితుడిని కలుసుకోవటానికి కారు దిగారు. అదే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మరణించారు. వెంట ఉన్నవారు ఆయనను దగ్గర్లో ఉన్న నివాసానికి తరలించారు.

దరూరు పుల్లయ్య స్వస్థలం అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం. విద్యాభ్యాసాన్ని మద్రాసులో పూర్తి చేసి న్యాయవాది వృత్తిలోకి అడుగుపెట్టారు. ఆయన 1968 నుంచి 1978 వరకు ఉరవకొండ పంచాయతీ సమితి ప్రెసిడెంట్‌గా సేవలు అందించారు. తర్వాత 1977, 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అనంతపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ప్రజాసేవలో ఆయన ఎంతో కాలం గడిపారు.

ఆయన మరణ వార్తతో బళ్లారి, అనంతపురం ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు ప్రజాప్రతినిధులు, కమ్మ సంఘం నాయకులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ప్రకారం, పార్థివ దేహాన్ని బళ్లారిలోని నివాసంలో ప్రజలు దర్శించుకునేందుకు ఉంచారు. అంత్యక్రియలు ఈ నెల 14వ తేదీ బుధవారం జరపనున్నారు.

దరూరు పుల్లయ్యకు భార్య సత్యవతి, ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మరణం కుటుంబానికి తీరని లోటు అని వారు భావిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?