
బంగాళాఖాతంలో (Bay of bengal) అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్ హెచ్చరికల సమాచారం తెలియక సముద్రంలో వేటకు వెళ్లడంతో తూర్పుగోదావరి జిల్లా (east godavari district) పాయకరావుపేట (payakaraopeta) మండలం ఎస్ రాయవరంలో (s rayavaram) మత్స్యకారులు చిక్కుకుపోయారు. రేవుపోలవరం వద్ద సముద్రంలో అలల తాకిడికి మత్య్సకారుల బోట్ బోల్తాపడింది. అయితే ఆరుగురు మత్స్యకారులు స్వల్ప గాయాలతో సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. కానీ వీరి వలలు సముద్రంలోకి కొట్టుకుపోగా.. అతికష్టం మీద బోటును ఒడ్డుకు తీసుకురాగలిగారు.
మరోవైపు నెల్లూరు జిల్లాలో వేటకు వెళ్లిన 11 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయారు. మత్య్సకారులంతా అల్లూరు మండలం తాటిచెట్లవారిపాలెం వాసులుగా గుర్తించారు. సాంకేతిక లోపం కారణంగా సముద్రంలోనే ఆగిపోయింది వారి బోటు. సమాచారం అందుకున్న కృష్ణపట్నం కోస్ట్‌గార్డ్స్ (krishna patnam) మత్స్యకారులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read:తిరుపతిలో వర్షబీభత్సం.. దాదాపు నగరమంతా నీటిలోనే, రాత్రంతా వానపడితే భయానకమే
అంతకుముందు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం చెన్నై (chennai rains) సమీపంలో తీరాన్ని దాటింది. గంటకు 4 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ చెన్నైకి దిగువన తీరాన్ని దాటినట్టు వాతావరణశాఖ ప్రకటించింది. వాయుగుండం భూ భాగంపైకి వచ్చిన అనంతరం క్రమంగా బలహీనపడుతుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో తిమళనాడుతో (tamilnadu rains) పాటు కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నట్టు ఐఎండీ వెల్లడించింది.
రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరో వైపు వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. అత్యవసర సహాయ చర్యల కోసం చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించినట్టు పేర్కొన్నారు. మరో వైపు ఈనెల 13న అండమాన్ తీర ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఇది నవంబర్ 17 నాటికి బలపడి తీరాన్ని దాటే అవకాశమున్నట్టు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణశాఖ స్పష్టం చేసింది.
"