బెలూన్ల బ్లాస్ట్.. రాహుల్‌ గాంధీకి తప్పిన ప్రమాదం

By sivanagaprasad kodatiFirst Published Oct 8, 2018, 9:46 AM IST
Highlights

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఆయన ఆదివారం ఎనిమిది కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించారు.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఆయన ఆదివారం ఎనిమిది కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించారు.

దీనిలో భాగంగా రాహుల్‌కు స్వాగతం పలికేందుకు అభిమానులు, కార్యకర్తలు ఎగబడ్డారు. కొందరు కార్యకర్తలు.. కాంగ్రెస్ పతాకాన్ని సూచించే మూడు రంగుల బెలూన్లతో ఆయనకు దారిపొడవునా స్వాగతం పలికారు. అదే సమయంలో మహిళా కార్యకర్తలు రాహుల్‌కు హారతి ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

గాలి భారీగా వీస్తుండటం.. జనాల సంఖ్య కూడా భారీగా ఉండటంతో మంటలు బెలూన్లను తాకాయి. దీంతో వాటిలో ఉన్న నైట్రోజన్ వాయువు బయటకు వచ్చి పెద్ద శబ్ధంతో బెలూన్లు పేలిపోయి మంటలు రేగాయి. అయితే, కొద్ది సెకండ్లలోనే గ్యాస్ అయిపోవడంతో మంటలు ఆరిపోయాయి.

మంటలను చూసిన వారంతా అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. వాహనం మీద ప్రజలకు అభివాదం చేస్తోన్న రాహుల్ కూడా ఒక్కసారిగా మంటలను చూసి పక్కకు జరిగారు. ఆ సమయంలో రాహుల్‌తో పాటు జ్యోతిరాదిత్య సింధియా, కమల్‌నాథ్ ఉన్నారు.

అయితే ఈ ఘటనలో కుట్రకోణం ఏం లేదని తేల్చారు పోలీసులు. హారతి ఇవ్వడానికి వచ్చిన వారంతా కాంగ్రెస్ కార్యకర్తలేనని.. అంతేకాకుండా వాహనానికి, కార్యకర్తలకు మధ్య కనీసం 15 మీటర్ల దూరం ఉందని జబల్‌పూర్ ఎస్పీ తెలిపారు. 

click me!