విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్నిప్రమాదం... చెలరేగిన మంటల్లో 40 బోట్లు కాలిబూడిద (వీడియో)

By Arun Kumar PFirst Published Nov 20, 2023, 9:50 AM IST
Highlights

ఆదివారం రాత్రి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో నిలిపిన 40 బోట్లు మంటల్లో చిక్కుకుని కాలిపోయాయి. 

విశాఖపట్నం : మత్స్యకారుల బోట్లు మంటల్లో కాలిబూడిదైన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ఫిషింగ్ హార్బర్ లో నిలిపివున్న ఓ బోటులో ప్రారంభంమైన మంటలు వేగంగా మిగతా బోట్లన్నింటికీ వ్యాపించాయి. మత్స్యకారులు ఈ అగ్నిప్రమాదాన్ని గమనించేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  

వివరాల్లోకి వెళితే... విశాఖపట్నంకు చెందిన మత్స్యకారులకు చేపలవేటే జీవనాదారం. సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టడమే వారికి తెలిసిన పని. ఇలా చేపలవేటకు సముద్రంలోకి వెళ్లేందుకు మత్స్యకారులు బోట్లను ఉపయోగిస్తుంటారు. చాలామంది మత్స్యకారులు సొంతంగా బోట్లను కలిగివుండగా మరికొందరు అద్దెకు తీసుకుంటారు. ఇలా మత్స్యకారులందరూ వేటకు ఉపయోగించే బోట్లను ఫిషింగ్ హార్బర్ లో పెడుతుంటారు. 

అయితే  గత రాత్రి ఫిషింగ్ హార్బర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఓ బోటులో ప్రారంభమైన మంటలు క్షణాల్లో మిగతా బోట్లన్నింటికి వ్యాపించాయి. ఇలా 40 బోట్లకు మంటలు అంటుకుని కాలిపోయాయి. భారీగా మంటలు చెలరేగడంతో మత్స్యకారులు ఎంతప్రయత్నించినా బోట్లను కాపాడుకోలేకపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపుచేసారు. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

వీడియో

ఇది సాధారణ అగ్నిప్రమాదం కాదని... ఎవరో కావాలనే నిప్పుపెట్టారని మత్స్యకారులు అంటున్నారు. తమ జీవినానికి ఆధారమైన బోట్లు కాలిపోవడంతో బాధిత మత్స్యకార కుటుంబాలు లబోదిబోమంటున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిప్రమాదం జరిగిన ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించారు. మత్స్యకారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 

విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంపై ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేసారు. ఈ అగ్నిప్రమాదానికి జగప్ ప్రభుత్వం భద్రతా చర్యలు తీసుకోకపోవడమే కారణమని అన్నారు. ఇప్పటికే అనేకచోట్ల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి... అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే తాజాగా మరోఘటన చోటుచేసుకుందని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కార్మికులు, మత్య్సకారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదముందన్నారు.

విశాఖలోని పలు పరిశ్రమల్లో ఇప్పటికే ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి... వాటిని చూసయినా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిషికొండ ప్యాలెస్ నిర్మాణంపై పెట్టిన శ్రద్ధ ప్రజల భద్రతపై పెట్టాలన్నారు. మరోసారి ఇలాంటి  మరోమారు అగ్నిప్రమాదాలు జరక్కుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు. 
 


 
 
 

click me!