
నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కలెక్టరేట్ ప్రాంగణంలోని స్టోర్ రూమ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలు పత్రాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఇక, కలెక్టరేట్ ఆఫీసు వెనక భాగంలో ఉన్న ఈ స్టోర్ రూమ్‌లో గత ఎన్నికలకు సంబంధించి కొన్ని పత్రాలు, పాత ఫర్నీచర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
అయితే ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్.. పనికిరాని గోదాములో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పారు. గోదాములో విద్యుత్ కనెక్షన్ లేన్నందున.. షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశం లేదని తెలిపారు. గోదాము పక్కన ఉన్న చెత్తను తగలబెట్టడం వల్ల మంటలు చెలరేగాయని అనుమానిస్తున్నట్టుగా చెప్పారు. మంటలు చెలరేగిన గోదాములో విలువైన పత్రాలు ఏమిలేవని తెలిపారు. గోదాములో ఖాళీ బ్యాలెట్ బ్యాక్స్‌లు, పనికిరాని ఫర్నీచర్ ఉందని అన్నారు.