వస్త్ర పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఏకంగా రూ.400 కోట్ల ఆస్తినష్టం జరిగింది. ఈ దుర్ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది.
బాపట్ల : ఓ వస్త్ర పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగి ఏకంగా రూ.400 కోట్ల సొత్తు కాలిబూడిదయ్యింది. కార్మికుల కళ్లముందే మంటలు దావానలంలా వ్యాపించి పరిశ్రమ మొత్తాన్ని చుట్టుముట్టాయి. దీంతో వస్త్ర తయారీకి ఉపయోగించే ముడిసరుకుతో పాటు మిషనరీ కూడా మంటల్లో ఆహుతి అయ్యింది. ఈ దుర్ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది.
పరిశ్రమ కార్మికులు, ఉద్యోగులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలకేంద్రానికి సమీపంలో ఎన్ఎస్ఎల్ వస్త్ర పరిశ్రమ నిర్వహిస్తున్నారు. దాదాపు 200 మంది కార్మికులు ఈ పరిశ్రమలో పనిచేస్తున్నారు. దసరా సీజన్ కావడంతో భారీగా వస్త్రాల తయారీ చేపట్టేందుకు వందలకోట్లతో ముడిసరుకును సిద్దం చేసుకున్నారు. ఇలా ఈసారి భారీగా బిజినెస్ చేయాలని యాజమాన్యం ప్లాన్ చేసిన సమయంలో అనుకోని ప్రమాదం వారిని నిండా ముంచింది.
గురువారం తెల్లవారుజామున కార్మికులంతా తమ పనుల్లో మునిగివుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది పసిగట్టిన కార్మికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అప్పటికే తయారుచేసిన వస్త్రాలతో పాటు మూడువేల టన్నుల దారం కాలిబూడిదయ్యింది. అలాగే పరిశ్రమ మొత్తం మంటలు వ్యాపించి వస్త్రాల తయారీకి ఉపయోగించే యంత్రాలను కూడా దహనం చేసారు. ఇలా అందరూ చూస్తుండగానే వేలకోట్ల సొత్తు మంటల్లో కాలిబూడిద అయ్యింది.
Read More నందిగామలో భారీ అగ్ని ప్రమాదం... కాలిబూడిదైన పర్నీచర్ షాప్ (వీడియో)
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే అప్పటికే వస్త్రాలు, దారం బిండలకు మంటలు అంటుకున్నాయి. ఎగసిపడుతున్న మంటలను అదుపుచేయడానికి ఫైరింజన్లతో మధ్యాహ్నం 12గంటల వరకు సిబ్బంది కష్టపడ్డారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు... కానీ ఊహించనంత ఆస్తినష్టం మాత్రం జరిగింది. దాదాపు రూ.400 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు కంపనీ యాజమాన్యం చెబుతోంది. అగ్నిప్రమాద సమయంలో వందలాదిమంది కార్మికులు పరిశ్రమలో పనిచేస్తున్నా ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు.. మంటలను పసిగట్టిన కార్మికులు బయటకు పరుగు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు.