ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఢీ: పాదయాత్రకు నారా లోకేష్ ప్లాన్

Published : Feb 22, 2022, 01:52 PM ISTUpdated : Feb 22, 2022, 03:02 PM IST
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఢీ: పాదయాత్రకు నారా లోకేష్ ప్లాన్

సారాంశం

వచ్చే ఎన్నికల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఢీకొనేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పాదయాత్ర చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ ను ఢీకొట్టేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్ ను ఎదుర్కునేందుకు అంగబలాలను ఆయన ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు వారసత్వాన్ని స్వీకరించే దిశగా ఆయన అడుగులు ముందుకు వేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో సత్తా చాటడానికి ఆయన పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర చేసిన నాయకులు అధికారంలోకి వస్తారనే సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేపట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమి పాలయ్యారు. అయితే, ఆ తర్వాత ఆయన పాదయాత్ర చేపట్టి, తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. దీంతో నారా లోకేష్ పాదయాత్ర చేయాలని సంకల్పించుకున్నట్లు తెలుస్తోంది.

సెంటిమెంట్ కారణంగానే కాకుండా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి, పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపడానికి నారా లోకేష్ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఆయన తన పాదయాత్రను జూన్ నెలలో ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇది నాలుగు విడతలుగా సాగుతుంది. మామ నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురం నుంచి నారా లోకేష్ తన పాదయాత్రను ప్రారంభిస్తారని టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో ఆయన పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారని భోగట్టా. గతంలో చంద్రబాబు తన పాదయాత్రను 8 జిల్లాలకు మాత్రమే పరిమితం చేశారు. అయితే, అన్ని జిల్లాలను చుట్టే విధంగా నారా లోకేష్ రోడ్ మ్యాప్ తయారు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటి వరకు కొనసాగిన రాబిన్ శర్మ టీమ్ పాదయాత్రకు స్కెచ్ వేసింది. అయితే, రాబిన్ శర్మ టీమ్ తప్పుకుని, సునీల్ కానుగోలు జట్టు రంగంలోకి దిగింది. టీడీపీకి వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్ కానుగోలు జట్టు నారా లోకేష్ పాదయాత్రకు స్కెచ్ తయారు చేస్తున్నట్లు సమాచారం. అది పూర్తి కాగానే జూన్ లో లోకేష్ పాదయాత్ర చేస్తారని అంటున్నారు. దానికి ముందు తన వ్యక్తిగత జట్టును పటిష్టం చేసుకునే దిశగా సాగుతున్నారు. ఓ జర్నలిస్టు ఓ తెలుగు టీవీ న్యూస్ చానెల్ కు రాజీనామా చేసి నారా లోకేష్ జట్టులో చేరుతున్నారు. సోషల్ మీడియాకు సంబంధించిన వ్యవహారాలను ఆయన చూస్తారని సమాచారం.

కాగా, రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించే పనిలో నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించారని అంటున్నారు. మార్చి నెలాఖరులోగా అన్ని నియోజకవర్గాలకు పార్టీ ఇంచార్జీలను నియమించాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రజలు వివిధ సంక్షేమ పథకాల అమలు కారణంగా వైఎస్ జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని, అయితే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం అసంతృప్తితో ఉందని టీడీపీ అంచనాగా తెలుస్తోంది. దీంతో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తమ వైపు తిప్పుకునే వ్యూహరచన కూడా చేయాలని లోకేష్ భావిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?