
రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు, కుమారుడు ప్రాణాలు కోల్పోతే.. ఆ బాధను అనుభవించే వారి పరిస్థితి ఎలా వుంటుందో అర్ధం చేసుకోవచ్చు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. కోళ్లబైలు పంచాయితీ కాట్లాటపల్లెకు చెందిన ఓబుల్ రెడ్డి, రమణమ్మ భార్యాభర్తలు. వీరికి కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి, కుమార్తె మనీషా వున్నారు. కుమార్తెకు పెళ్లయి అత్తారింట్లో వుంటుంది.
సంతోషంగా సాగిపోతున్న వీరి కుటుంబంలో అనుకోని కుదుపు. ఏమైందో ఏమో తెలియదు గానీ ఈ ఏడాది మార్చిలో కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే చెట్టంత ఎదిగిన కుమారుడు ఇక లేడని తెలిసి , అతని జ్ఞాపకాలు నిండిన ఇంట్లో జీవించలేక ఓబుల్ రెడ్డి దంపతులు మరో చోటికి మకాం మార్చారు.
అయితే నెలలు గడవక ముందే గత నెల 11న ఓబుల్ రెడ్డి భార్య రమణమ్మ కుమారుడి మృతిని తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెలల వ్యవధిలో భార్య, కుమారుడు మరణించడంతో ఓబుల్ రెడ్డి తట్టుకోలేకపోయాడు. మద్యానికి బానిసైన ఆయన శుక్రవారం ఇంటి బాత్రూమ్ సమీపంలో శవమై కనిపించాడు. అయితే దీనిని గమనించిన స్థానికులు హత్యగా భావించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. తన సోదరుడి కుటుంబానికి రూ.3 కోట్ల విలువ చేసే పొలం వుందని.. ఆస్తి కోసం ఆయనను ఎవరైనా హత్య చేసి వుండొచ్చని మృతుడి సోదరుడు అనుమానం వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో ఓబుల్ రెడ్డి తల వెనుక గాయం వుండటాన్ని పోలీసులు గుర్తించారు.