ఆషాడంలో ఇంటికి వచ్చాడని.. కొత్త అల్లుడిని చంపిన మామ

Published : Jul 12, 2018, 09:54 AM IST
ఆషాడంలో ఇంటికి వచ్చాడని.. కొత్త అల్లుడిని చంపిన మామ

సారాంశం

ఆషాడం కావడంతో ఇంటికి రావద్దని చెప్పినా అల్లుడు వినిపించుకోకుండా వస్తున్నాడన్న కోపంతో అల్లుడిపై కత్తితో దాడిచేసి హత్య చేసిన ఆ మామకు జీవితఖైదు, రూ. 2,000 జరిమానాను న్యాయస్థానం విధించింది.

కొత్తగా పెళ్లి అయిన దంపతులు ఆషాడమాసంలో  అత్తారింట్లో అడుగుపెట్టకూడదనే నియమాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో క్రమం తప్పకుండా పాటిస్తారు. ఈ విషయం మనకు తెలిసిందే. ఇదే నియమాన్ని సరిగా పాటించలేదని ఓ మామ.. కొత్త అల్లుడిని చంపేశాడు. ఈ సంఘటన అమలాపురంలో 2015లో జరగగా.. బుధవారం కోర్టులో హియరింగ్ కి వచ్చింది.

ఆషాడం కావడంతో ఇంటికి రావద్దని చెప్పినా అల్లుడు వినిపించుకోకుండా వస్తున్నాడన్న కోపంతో అల్లుడిపై కత్తితో దాడిచేసి హత్య చేసిన ఆ మామకు జీవితఖైదు, రూ. 2,000 జరిమానాను న్యాయస్థానం విధించింది. రెండో అదనపు జిల్లా సెషన్‌ జడ్జి బీఎస్వీ హిమబిందు ఈ తీర్పును వెలువరించారు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన లోకినీడి అక్కిరాజు కుమార్తె దుర్గాభవానికి ముమ్మిడివరం మండలం క్రాపచింతలపూడి గ్రామానికి చెందిన అమలదాసు సత్తిబాబుతో 2015లో వివాహమైంది. 

వివాహం అనంతరం ఆషాఢ మాసం రావడంతో దుర్గాభవానీ తన పుట్టింటికి వచ్చేసింది. దీంతో భార్యను వదిలి ఉండలేని సత్తిబాబు ఆమె కలుసుకోడానికి అత్తవారింటికి వస్తుండటంతో మామ లోకినీడి రావద్దని హెచ్చరించాడు. మామ మాటలను అంత సీరియస్‌గా తీసుకోని సత్తిబాబు మళ్లీ 2015 జులై 8 రాత్రి అత్తారింటికి వచ్చాడు. 

దీంతో అల్లుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మామ ఇతర కుటుంబసభ్యులు చూస్తుండగానే దాడిచేశాడు. ఈ దాడిలో తన భర్త ప్రాణాలు కోల్పోయాడని పోలీసులకు దుర్గాభవానీ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి మామను అరెస్ట్ చేశారు. దర్యాప్తు పూర్తిచేసిన పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో ఈ కేసు బుధవారం తుది విచారణకు వచ్చింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి, నిందితుడు లోకినీడి అక్కిరాజు నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు, రూ.2,000 జరిమానా విధించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : దేశవ్యాప్తంగా వర్షాలు, ఈ తెలుగు జిల్లాల్లోనూ.. ఎల్లో అలర్ట్ జారీ
Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu