బాబుపై దాడి కోపానికి అదే కారణం: పవన్ కల్యాణ్ వైపు చూపు

First Published Jul 12, 2018, 8:12 AM IST
Highlights

దాడి పవన్ కల్యాణ్ వెంట నడుస్తారా లేదా అనేది ఇంకా అనుమానంగానే ఉంది. చంద్రబాబు నుంచి పిలువు వస్తుందేమోననే ఆశతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. కానీ ఆ ఆశ ఫలించేట్లు లేదని  అంటున్నారు.

విశాఖపట్నం: మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో చేరాలనే ఆయన ప్రయత్నాలు ఓ కొలిక్కి రావడం లేదు. దీంతో ఆయన మరో వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ దాడిని కలిశారు. దీంతో ఆయన జనసేనలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది.

దాడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని రాష్ట్ర విభజనకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ తనతో మాట మాత్రంగానైనా చెప్పకుండా యనమల రామకృష్ణుడికి ఇచ్చారనే కోపంతో పార్టీని వీడారు. దాడితో పాటు ఆయన కుమారుడు దాడి రత్నాకర్‌ కూడా పార్టీని వీడారు. 

పార్టీ నుంచి బయటకు వస్తూ దాడి వీరభద్రరావు కొన్ని ఆరోపణలు కూడా చేశారు. ఆ తర్వాత ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. సీట్ల సర్దుబాటులో భాగంగా దాడి రత్నాకర్‌కు అనకాపల్లి నియోజకవర్గం కాకుండా విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని జగన్ కేటాయించారు. అనకాపల్లి నియోజకవర్గాన్ని కొణతాల రామృష్ణ సోదరుడికి కేటాయించారు 

ఆ ఎన్నికల్లో దాడి రత్నాకర్‌ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నాలుగేళ్ల క్రితం వైసిపి నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి దాడి రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. మళ్లీ టీడీపీలోకి వెళ్లాలన్న ఉద్దేశం ఆయనలో ఉందని అనుచరులు అంటున్నారు. కానీ పార్టీలోంచి బయటకు వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబును కలుసుకోలేదు. టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు పంపించారని అంటున్నారు. 
 
ఈ స్థితిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నేరుగా అనకాపల్లిలోని దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లారు. ఆయన పుట్టినరోజు నాడు ఈ భేటీ జరిగింది. దాడి వీరభద్రరావుతో కలిసి లంచ్‌ చేసిన పవన్‌కల్యాణ్‌ ఆయనపై ప్రశంసలు జల్లు కురిపించారు. జనసేనలో చేరాలని పవన్ ఆయనను ఆహ్వానించినట్లు చెబుతున్నారు.

అయితే, తాను జనసేనలో చేరుతానని దాడి కచ్చితంగా చెప్పలేదని అంటున్నారు. తన నిర్ణయాన్ని తర్వాత చెబుతానని దాడి పవన్ కల్యాణ్ తో చెప్పినట్లు సమాచారం. తనకు టీడీపి నుంచి ఆహ్వానం వస్తుందనే ఆశతో దాడి ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే అలా వేచి చూడడం కన్నా జనసేనలో చేరడం మంచిదనే అభిప్రాయానికి దాడి వీరభద్రరావు వచ్చినట్లు చెబుతున్నారు. సన్నిహితులతో, అభిమానులతో చర్చించి ఆ విషయంపై నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నారు.

click me!