విషాదం.. ఇంట్లో కమ్ముకున్న పొగలో ఊపిరాడక.. తండ్రీకొడుకు మృతి..

By SumaBala BukkaFirst Published Nov 21, 2022, 10:30 AM IST
Highlights

కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఓ తండ్రీ కొడుకుల ప్రాణాలు బలితీసుకుంది. చీకటి, పొగ కమ్ముకుపోయి.. ఇంట్లోనుంచి బయటికి రాలేక పోవడంతో కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.

నర్సీపట్నం : అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శనివారం అర్ధరాత్రి ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కమ్ముకున్న పొగతో ఊపిరి ఆడక తండ్రీ కొడుకు మృతి చెందారు. బంగారం దుకాణం యజమాని నవర మల్లేశ్వరరావు అలియాస్ నానాజీ (45), ఆయన కుమారుడు మౌలీష్ ఆర్యన్ (19) ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. అదే ఇంట్లో ఉన్న నానాజీ  భార్య, కుమార్తెలు పొగతో అస్వస్థతకు గురయ్యారు. కృష్ణాబజార్ లో ఈ కుటుంబానికి గోల్డ్ షాప్ ఉంది. దుకాణం మీద డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నారు. 

మొదటి అంతస్తులోని గదిలో కూతురు.. రెండో అంతస్థులోని గదిలో కుమారుడు ఆర్యన్ తో పాటు నానాజీ, ఆయన భార్య,  పడుకున్నారు. మొదటి అంతస్తు హాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దట్టమైన పొగ అలుముకుంది. కరెంట్ లేకపోవడంతో చీకటి, దట్టమైన పొగ కారణంగా కుటుంబసభ్యులు బయటకి రాలేక పోయారు. దీంతో నానాజీ ఇంట్లో నుంచే తమ ఇంటి పొరుగున ఉండే తన ఇద్దరు సోదరులకు ఫోన్ చేశాడు. షార్ట్ సర్క్యూట్ పొగకమ్ముకున్న విషయాన్ని తెలిపారు. 

వెంటనే వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఇల్లంతా దట్టంగా పొగలు వ్యాపించి ఉన్నాయి. వారి సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వచ్చింది. స్థానికులు ఇంటి గేటు తాళం బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లో ఇరుక్కుపోయిన నలుగురిని బయటికి తీసుకు వచ్చి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆస్పత్రికి వెళ్లేసరికే నానాజీ, ఆర్యన్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భార్య, కుమార్తెలను మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం పంపించారు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

రేపు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు జగన్.. నరసాపురంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

ఇదిలా ఉండగా,

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి కొత్తకోట మండలంలోని జాతీయ రహదారిపై ముమ్మాళ్లపల్లి దగ్గర ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రివేళ చెరుకు లోడుతో వెడుతున్న ట్రాక్టర్ ను వేగంగా వస్తున్న గరుడ బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. 16 మందికి గాయాలయ్యాయి. 

ప్రమాదం జరిగిన సమయంలో గరుఢ బస్సులో 48మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఈ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెడుతోంది. మియాపూర్ డిపోకు చెందిన గరుడ బస్సు హైదరాబాద్ నుంచి బయలుదేరగా ఈ ఘటన చోటు చేసుకుంది. గరుఢ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఈ ప్రమాదంలో చనిపోయారు. మృతుల్లో డ్రైవర్, క్లీనర్, ఓ ప్రయాణికుడు ఉన్నారు.  

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను, క్షతగాత్రులను అంబులెన్స్ లో వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంతో ముమ్మాళ్లపల్లి నుంచి అమడబాకుల వరకు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. 

click me!