
శ్రీసత్యసాయి జిల్లాలో సీఎం వైఎస్ జగన్‌కు నిరసన సెగ తగిలించింది. సీఎం జగన్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు రైతులు యత్నించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది రైతులను పక్కకు నెట్టేశారు. వివరాలు.. సీఎం వైఎస్ జగన్ ఈ రోజు అనంతపురం జిల్లా శింగనమల నియోజకర్గం నార్పలలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం జగన్.. జగనన్న వసతి దీవెన నిధులను విడుదల చేశారు. అనంతరం సీఎం జగన్ అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు. అయితే సీఎం జగన్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సీఎం జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు వెళ్లారు.
అయితే సీఎం జగన్ పుట్టపర్తి వెళ్తున్న సమయంలో ఆయన కాన్వాయ్‌ను తుంపర్తి, మోటుమర్రి గ్రామాల రైతులు అడ్డుకునేందుకు యత్నించారు. పేదల ఇళ్ల స్థలాల కోసం సేకరించిన 210 ఎకరాలకు పరిహారం ఇవ్వలేదని రైతులు ఆరోపించారు. నష్టపరిహారం చెల్లించాలంటూ జగన్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది రైతులను పక్కకు నెట్టేశారు.