పోలీసులు,రెవెన్యూ సిబ్బంది ఎదురుగానే తన పొలంలో కత్తులతో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ కౌలు రైతు.
గుంటూరు: తాను పండించిన పంటను కాపాడుకునేందుకు తన ప్రాణాలనే పణంగా పెట్టాడు ఓ రైతు. కౌలుకు తీసుకున్న భూమిలో పంట వుండగానే అధికార అండతో కొందరు ఆక్రమించుకోడానికి ప్రయత్నించడంతో తట్టుకోలేకపోయిన రైతు దారుణ నిర్ణయం తీసుకున్నాడు. పోలీసులు,రెవెన్యూ సిబ్బంది ఎదురుగానే తన పొలంలో కత్తులతో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... వేమూరు మండలం పోతుమర్రి గ్రామానికి చెందిన సలీం ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగుచేసుకుంటున్నాడు. అయితే ఈ భూమిలో పంట వుండగానే ఆక్రమించుకోడానికి కొందరు వైసిపి నాయకులు ప్రయత్నించారు. అధికార పార్టీ నాయకులు కావడంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కూడా వారికే వత్తాసు పలికారు.
ఈ క్రమంలోనే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సలీం కౌలుభూమిని స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నించగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది సాధ్యం కాకపోవడంతో తీవ్ర మనస్ధాపానికి గురయ్యారు. ఓ వైపు అధికారులు తన పంటను కోయిస్తుండగా అదే పొలంలో వారి ఎదురుగానే సలీం ఆత్మహత్యాయత్నం చేశాడు. తన వెంట తెచ్చుకున్న రెండు కత్తులతో కడుపులో పొడుచుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
దీంతో వెంటనే అధికారులు స్పందించి అతడిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే వున్నట్లు డాక్టర్లు తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ సలీం కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకున్నారు.