
పల్నాడు : ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పంట పొలంలో వ్యర్ధాలను తగలబెడుతూ ఆ మంటలు అంటుకొని ఓ రైతు సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులో వెలుగు చూసింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఈ మేరకు ఉన్నాయి. 70 ఏళ్ల బండారుపల్లి వెంకటేశ్వర్లు అనే రైతు.. తన పొలంలో మొక్కజొన్న పంటను వేశాడు. పంట కోతలు అయిపోయిన తర్వాత మిగిలిన వ్యర్ధాలు పొలంలో ఉన్నాయి. బుధవారం నాడు వాటిని తగలబెట్టాడు.
అయితే ఆ మంటలు పక్కనే ఉన్న తన సోదరుడి పొలంలోని పంటకు వ్యాపిస్తుండడం చూసి వాటిని ఆపేందుకు పరిగెత్తాడు. ఈ క్రమంలో కాలికి ఏదో తగిలి కింద పడిపోయాడు. దీంతో మంటలు అతడిని చుట్టుముట్టాయి. రైతు కింద పడడాన్ని గమనించిన కొంతమంది గొర్రెల కాపరులు ఆయనను రక్షించడానికి ప్రయత్నించారు.
జగన్ గెటవుట్ అన్నా.. ఫాలోవర్‌గానైనా వుంటా, ఫేక్ వార్తలపై తేల్చేసిన అనిల్ కుమార్ యాదవ్
అయితే మంటలు తీవ్రస్థాయిలో ఎగిసిపడుతుండడంతో అది సాధ్యం కాలేదు. మంటలు చుట్టుముట్టడంతో రైతు అందులోనే పడి సజీవ దహనమయ్యాడు. కాగా వెంకటేశ్వరు సాయంత్రం గడిచిపోయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన కోసం గాలించడం మొదలు పెట్టారు. పొలం దగ్గరికి చేరుకుని చూసేసరికి అక్కడ విగత జీవిగా రైతు కనిపించాడు.
అది చూసి ఒకసారిగా షాక్ అయిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదించారు. గురువారం నాడు రైతు మృతదేహాన్ని టిడిపి నాయకులు కొంతమంది సందర్శించి, నివాళులర్పించారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని నాదెండ్ల పోలీసులు తెలిపారు.