Latest Videos

మరో ఆరు నెలలు ఆయనే ఏపీ సీఎస్... కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు

By Galam Venkata RaoFirst Published Jun 27, 2024, 1:55 PM IST
Highlights

ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఏపీ ప్రభుత్వ విజ్నప్తి మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్నీ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్ ప్రసాద్‌ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ప్రబుత్వ కార్యదర్శి భూపేందర్ పాల్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. 

సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ త్వరలోనే రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఏపీ ప్రభుత్వ విజ్నప్తి మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్నీ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం... జూలై 1 2024 నుంచి డిసెంబర్ 31 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు.    

ఇటీవల ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం సాధించింది. కూటమి తరఫున చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టే ముందు సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించింది. ఆయన పదవీకాలం జూన్ నెలాఖరుకు ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ సేవలను కొనసాగించాలని భావించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దానికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. 

ఇదీ నేపథ్యం...

 

AP CS Neerabh Kumar Prasad : ‌ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్‌ను నియమిస్తూ జూన్ 7న సాధారణ పరిపాలన శాఖ స‌ర్క్యూల‌ర్ జారీ చేసింది. జూన్ 8న ఏపీ కొత్త సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకముందు  పలు కీలక శాఖలు బాధ్యతలను ఆయన నిర్వర్తించారు.

బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ 1988లో పశ్చిమ గోదావరి జిల్లాలో అసిస్టెంట్ కలక్టర్(ట్రైనీ)గా ఉద్యోగ బాధ్యతలతో త‌న ప్ర‌యాణం మొద‌లు పెట్టారు. 1990లో తూర్పు గోదావరి సబ్ కలక్టర్ గా విధులు నిర్వ‌ర్తించారు. అలాగే, రంపచోడవరం సబ్ కలక్టర్ గానూ, 1991లో ఏటూరు నాగారం పీఓ ఐటీడీఏగా, 1992లో కృష్ణా జిల్లా పీడీ ఆర్డీఏగానూ ఆయ‌న ప‌నిచేశారు. 1993లో కృష్ణా జిల్లా జాయింట్ కలక్టర్ గా,1996లో ఖమ్మం కలక్టర్ గా,1998లో చిత్తూరు కలక్టర్ గా పనిచేశారు.

1999లో యువజన సంక్షేమశాఖ డైరెక్టర్, శాప్ ఎండిగా పనిచేసి నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ 2000 ఏడాదిలో కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్ పై వెళ్ళారు. 2005లో రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ వీసీ అండ్ ఎండిగా, 2007లో పరిశ్రమల శాఖ కమీషనర్ గా, 2009లో మత్స్యశాఖ కమీషనర్ గా, ఎపి ఎస్ హెచ్సి ఎండిగా పనిచేశారు. 2012లో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన అండ్ పట్టణాభివృద్ధి సంస్థ కమీషనర్  బాధ్య‌త‌లు చేప‌ట్టారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జీఏడీ ముఖ్య కార్యదర్శి కొన‌సాగిన ఆయ‌న 2015లో వైఏటీసీ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.

2017లో కార్మిక ఉపాధి కల్పన అండ్ శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప‌నిచేశాడు. 2018లో టీఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, 2019లో రాష్ట్ర పర్యావరణ, అటవీ,శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. 2019 నవంబరు నుండి చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ)గా పనిచేసి ాయన..  2022 ఫిబ్రవరి 23 నుండి రాష్ట్ర పర్యావరణ,అటవీ,శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

click me!