
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి స్టేషన్ ఆవరణలో ఉన్న కార్లు, ఇతర వాహనాలు దెబ్బతిన్నాయి. స్టేషన్ ఆవరణలో పూడ్చిపెట్టిన గన్ పౌడర్ వల్ల పేలుడు సంభవించినట్టుగా పోలీసులు తెలిపారు. పేలుడు సమయంలో పోలీస్ స్టేషన్‌లో విధుల్లో ఉన్న ఏఎస్ఐ ఆంజనేయులు రెడ్డికి స్వల్ప గాయాలైనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనతో పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంత ప్రజలు కూడా ఉలిక్కిపడ్డారు.
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్ ఆవరణలో పూడ్చిపెట్టిన గన్ పౌడర్ పేలిందని చెప్పారు. 2018లో ఓ కేసుకు సంబంధించి గన్ పౌడర్ సీజ్ చేసినట్టుగా తెలిపారు. అందులో ఎఫ్‌ఎస్‌ఎల్ కోసం ఉపయోగించిన గన్ పౌడర్‌ను పోలీసు స్టేషన్ వెనకాల ఉన్న మర్రిచెట్టు కింద భాగంలో పూడ్చి పెట్టడం జరిగిందని చెప్పారు. మర్రిచెట్టు కింది భాగంలో చిన్నపాటి పేలుడు సంభవించిందని తెలిపారు. ప్రజలు, పోలీసు సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు.