పోల‌వ‌రంపై ఒడిశా, ఛత్తీస్‌గఢ్ , తెలంగాణల అభ్యంతరాలు... ఉమ్మడి సర్వేకు ఏపీ అంగీకారం

By Siva KodatiFirst Published Oct 7, 2022, 10:16 PM IST
Highlights

పోలవరం బ్యాక్ వాటర్స్‌పై కేంద్ర జలసంఘం సాంకేతిక కమిటీ భేటీ అయ్యింది. తెలంగాణ, ఒడిశా అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ప్రాజెక్ట్‌పై ఉమ్మడి సర్వేకు సిద్ధమని ప్రకటించింది. 

పోలవరం బ్యాక్ వాటర్స్‌పై కేంద్ర జలసంఘం సాంకేతిక కమిటీ భేటీ అయ్యింది. స్పిల్‌వే డిజైన్, బ్యాక్ వాటర్స్ ప్రభావం, ట్రైబ్యునల్ అవార్డుపై చర్చించింది. ఈ సమావేశానికి జలసంఘం, ఏపీ, తెలంగాణ , ఒడిశా, ఛత్తీస్‌గఢ్ అధికారులు హాజరయ్యారు. బ్యాక్ వాటర్స్‌తో ముంపు సమస్య అన్న రాష్ట్రాల వాదనను కేంద్రం తిరస్కరించింది. గోదావరి వరద ప్రవాహానికి అనుగుణంగా స్పిల్ వే డిజైన్ వుందా.? లేదా.. ? అనే అంశంపై సమావేశంలో ప్రస్తావించారు. 

అయితే పోలవరం స్పిల్ వే డిజైన్లపై అనుమానం వ్యక్తం చేశాయి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు. ఏపీకి అనుకూలంగా బ్యాక్ వాటర్స్ సర్వే చేశారని ఒడిశా ఆరోపించింది. బ్యాక్ వాటర్స్ అంచనాపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని ఒడిశా కోరింది. బ్యాక్ వాటర్స్‌పై కొత్తగా సర్వే చేయాలని తెలంగాణ ఇంజినీర్లు కోరారు. పాత గణాంకాలతో కేంద్ర జలసంఘం నివేదిక ఇచ్చిందని తెలంగాణ అధికారులు వాదించారు. జులైలో వచ్చిన వరదలతో 28 వేల ఇళ్లు మునిగిపోయాయని తెలంగాణ పేర్కొంది. గోదావరి అనుబంధ నీటివనరులపై ఉమ్మడి సర్వేకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. 

ఈ నేపథ్యంలో తెలంగాణ, ఒడిశా అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. పోలవరం ప్రాజెక్ట్‌పై ఉమ్మడి సర్వేకు సిద్ధమని ప్రకటించింది. అలాగే పోలవరం బ్యాక్ వాటర్‌ కారణంగా పొరుగు రాష్ట్రాల్లో జరిగే నష్టాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టేందుకు కూడా సిద్ధమేనని ఏపీ తెలిపింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని సాంకేతిక అంశాల‌తో ఈ నెల 19లోగా వివ‌రాల‌ను సమర్పించాలని కేంద్ర జ‌ల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.

ALso Read:పోలవరంపై నాలుగు రాష్ట్రాలతో ముగిసిన కేంద్ర జల‌్‌శక్తి శాఖ భేటీ... ఏం తేల్చారంటే..?

ఇకపోతే... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన నాలుగు రాష్ట్రాలతో కేంద్ర జలశక్తి శాఖ సెప్టెంబర్ 29న సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్‌పై కేంద్రం అధ్యయనం చేస్తోన్న సంగతి తెలిసిందే. 2019, 2011లలో పోలవరం బ్యాక్ వాటర్‌పై సర్వేలు జరిగాయని కేంద్రం చెబుతోంది. ముంపు ప్రభావంపై ఒడిశా, తెలంగాణ , ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు అపోహలు పడుతున్నాయని కేంద్రం అభిప్రాయపడింది. భద్రాచలానికి ఎలాంటి ముంపు లేదని కేంద్రం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యాక కూడా మూడు రాష్ట్రాల్లో అడుగులో మూడో వంతు ముంపు ప్రభావం కూడా వుండదని కేంద్రం చెప్పింది. ముంపు ప్రభావం లేకుండా కరకట్ట కట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనా .. ఒడిషా ప్రజాభిప్రాయ సేకరణకు ముందుకు రాలేదని కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7న సాంకేతిక నిపుణులతో కేంద్ర జలశక్తి శాఖ మరోసారి భేటీ కానుంది. 

ఇకపోతే.. పోలవరం బ్యాక్ వాటర్ పై మరోసారి అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశంలో డిమాండ్ చేసింది. బ్యాక్ వాటర్ కారణంగా భద్రచాలం సహా పరిసర గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని తెలంగాణ అభిప్రాయపడింది. ఈ ఏడాది జూలైలో గోదావరి వరదను కూడా తెలంగాణ అధికారులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ముంపు నివారణకు రక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ కోరింది. అలాగే రక్షణ కోసం నిర్మించే గోడలకు అయ్యే ఖర్చును పోలవరం అథారిటీ భరించాలని తెలంగాణ కోరింది. 
 

click me!