చంద్రబాబును జెసి సోదరులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?

First Published Dec 30, 2017, 12:36 PM IST
Highlights
  • తెలుగుదేశంపార్టీకి సంబంధించి అనంతపురం జిల్లాలో విచిత్రమైన పరిస్ధితి కనిపిస్తోంది.

తెలుగుదేశంపార్టీకి సంబంధించి అనంతపురం జిల్లాలో విచిత్రమైన పరిస్ధితి మొదలైంది. ఇటువంటి పరిస్దితి గతంలో ఎక్కడా, ఎవ్వరికీ ఎదురవ్వలేదు. ఇంతకీ అనంతపురం జిల్లాలో కనబడుతున్న విచిత్రమేమిటంటే, అధికారపార్టీ నేతలే అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై బహిరంగంగా ధ్వజమెత్తుతుండటం. అదికూడా జెసి సోదరులను లక్ష్యంగా చేసుకునే ఆరోపణలు గుప్పిస్తున్నారు. అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి కథ ఒకరకంగా ఉంటే, సోదరుడు తాడిపత్రి ఎంఎల్ఏ జెసి ప్రభాకర్ రెడ్డి కథ ఇంకో రకంగా ఉంది.

ఇంతకీ విషయం ఏమిటంటే, జెసి సోదరులకు జిల్లాలోని చాలామంది టిడిపి నేతలతో పడటం లేదన్నది స్పష్టమైపోయింది. దివాకర్ రెడ్డికేమో అనంతపురం ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరితో పొసగటం లేదు. దాంతో ప్రభాకర్ మద్దతుదారులందరూ ఎంపిపై కత్తి కట్టారు. అదే విధంగా తాడిపత్రిలో ఏమో ప్రభాకర్ రెడ్డిపై సొంతపార్టీ నేతలే మండిపడుతున్నారు. మామూలుగా అయితే, ప్రతిపక్షాల నేతలు అధికారపార్టీ నేతలపై ఆరోపణలు, విమర్శలు చేయటం సహజం. కానీ జిల్లా టిడిపిలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణ కనబడుతోంది.

తాజాగా, తాడిపత్రి మున్సిపాలిటీలో కోట్లరూపాయలు ప్రభాకర్ రెడ్డి దోచుకుంటున్నట్లు టిడిపి బహిష్కృత కౌన్సిలర్ జయచంద్రారెడ్డి చేసిన ఆరోపణలు సంచలనంగా మారింది. మీడియాతో జయచంద్రారెడ్డి మాట్లాడుతూ, కేవలం అధికారం కోసమే జెసి సోదరులు టిడిపిలోకి వచ్చారంటూ మండిపడ్డారు. ఏనాడూ పార్టీ కండువా కప్పుకోని వాళ్ళు ఏకంగా చంద్రబాబునాయుడునే బ్లాక్ మైల్ చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. అసలు మొత్తం తాడిపత్రి నియోజకవర్గమే జెసి సోదరుల కంబంధహస్తాల్లో ఇరుక్కుందని మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎంఎల్ఏ పబ్బం గడుపుకుంటున్నట్లు ఆరోపించారు. పోలీసులు లేకుండా ఇంట్లో నుండి కాలు కూడా బయటపెట్టలేని ఎంఎల్ఏ అదే పోలీసులను పోలీసు స్టేషన్లోనే దుర్బాషలాడటాన్ని ప్రశ్నించారు.

సరే, జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే జెసి సోదరులను టిడిపి నుండి బయగటకు సాగనంపటానికి ఏదన్నా వ్యూహం మొదలైందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే, అనంతపురంలో అయితే, కమ్మ-రెడ్డి సామాజికవర్గాల గొడవ అనుకుందాం. మరి, తాడిపత్రిలో ఎంఎల్ఏ అయినా, బహిష్కృత కౌన్సిలర్ అయినా ఇద్దరూ రెడ్లే కదా? ప్రభుత్వ కార్యాలయాల్లోకి రప్పించి హత్యలు చేయించటం జెసిల నైజమంటూ మండిపడ్డారు. పెద్దవడుగూరు మండలం అప్పేచర్ల విజయభాస్కర్ రెడ్డి హత్యే అందుక నిదర్శనంగా కౌన్సిలర్ పెద్ద బాంబే పేల్చటం గమనార్హం.

click me!