ఎగ్టిట్ పోల్స్: తిరుపతిలో వైసీపీ ఘన విజయం, 'వకీల్ సాబ్' మానియా తుస్సు

Published : Apr 30, 2021, 08:24 AM IST
ఎగ్టిట్ పోల్స్: తిరుపతిలో వైసీపీ ఘన విజయం, 'వకీల్ సాబ్' మానియా తుస్సు

సారాంశం

తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఘన విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితం తెలియజేస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ మానియా పనిచేయలేదని అర్థమవుతోంది.

అమరావతి: తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి గురుమూర్తి ఘనవిజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్ ఫలితం తెలియజేస్తోంది.  తిరుపతి ఉప ఎన్నికలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ మానియా పనిచేయలేదని తెలుస్తోంది. బిజెపి, జనసేన కూటమి అభ్యర్థి రత్నప్రభ మూడో స్థానానికే పరిమితమవుతారని ఆరా సంస్థ తాను విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితంలో తెలియజేసింది. 

తిరుపతి లోకసభ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. వకీల్ సాబ్ సినిమా విజయం సాధించింది కాబట్టి తిరుపతిలో తమ అభ్యర్తి గెలుస్తారని బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ సునీల్ ధియోదర్ అన్నారు. ఏపీలో వకీల్ సాబ్ బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడంపై బిజెపి నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే, అవేవీ ఫలితం ఇవ్వడం లేదని తెలుస్తోంది. 

తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీకి 65.85 శాతం ఓట్లు, వస్తాయని ఆరా సంస్థ తేల్చింది. టీడీపీ రెండో స్థానంలో వస్తుందని చెప్పింది. టీడీపీకి 23.10 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 3.71 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని చెప్పింది. 

వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించడంతో తిరుపతి లోకసభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. మే 2వ తేదీన ఫలితం వెలువడనుంది. వైసీపీ తరఫున గురుమూర్తి, టీడీపీ తరఫున పనబాక లక్ష్మి పోటీ చేశారు. బిజెపి, జనసేన కూటమి అభ్యర్థిగా రత్నప్రభ పోటీ చేశారు. తనను తన తమ్ముడు పవన్ కల్యాణ్ గెలిపిస్తారని రత్నప్రభ ఎన్నికల ప్రచార సభలో అన్నారు రత్నప్రభకు మద్దతుగా పవన్ కల్యాణ్ తిరుపతిలో ర్యాలీ కూడా నిర్వహించారు. 

టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కోసం ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ప్రచారం చేయాల్సి ఉండింది. అయితే, కరోనా కారణంగా తన ఎన్నికల ప్రచార సభను రద్దు చేసుకుంటున్నట్లు వైఎస్ జగన్ చెప్పారు. ఆ మేరకు ఆయన ఓటర్లకు ఓ బహిరంగ లేఖ రాశారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్