
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. రోజురోజుకు కేసులు పెరగడమే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. పరిస్ధితులను చూస్తుంటే దేశంలో కోవిడ్ తీవ్రత అధికంగా వున్న ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లతో ఏపీ పోటీపడుతుందా అనిపిస్తోంది.
వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ తో పాటు కొన్ని ప్రాంతాల్లో మినీ లాక్‌డౌన్‌లు విధించినా పరిస్దితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 14,792 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 10,84,336కి చేరింది. నిన్న ఒక్కరోజు రాష్ట్రంలో 57 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 7,928కి చేరుకుంది.
నిన్న ఒక్కరోజు అనంతపురం 7, విజయనగరం 7, పశ్చిమ గోదావరి 7, తూర్పుగోదావరి 6, చిత్తూరు 5, విశాఖపట్నం 5, నెల్లూరు 4, శ్రీకాకుళం 4, కడప 3, కృష్ణ 3, ప్రకాశం 3, కర్నూలు 2, గుంటూరులో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
గత 24 గంటల వ్యవధిలో 8,188 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 9,62,250కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు 86,035 మంది శాంపిల్స్ పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా నిర్థారణా పరీక్షల సంఖ్య 1,63,03,866కి చేరుకుంది.
గడిచిన 24 గంటల్లో అనంతపురం 1538, చిత్తూరు 1831, తూర్పుగోదావరి 1702, గుంటూరు 1760, కడప 669, కృష్ణా 597, కర్నూలు 876, నెల్లూరు 1002, ప్రకాశం 639, శ్రీకాకుళం 1829, విశాఖపట్నం 1129, విజయనగరం 624, పశ్చిమ గోదావరిలలో 596 మందికి వైరస్ బారినపడ్డారు.
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం. #ANCares #IndiaFightsCorona