తొలి ఓటు టీడీపీకే, 34 ఏళ్ల బంధం.. గుండెల్లో చెప్పలేని బాధ: కదిరి బాబూరావు

By Siva Kodati  |  First Published Mar 10, 2020, 4:52 PM IST

టీడీపీ సీనియర్ నేత కదిరి బాబూ రావు మంగళవారం వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. 


టీడీపీ సీనియర్ నేత కదిరి బాబూ రావు మంగళవారం వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను మొట్టమొదటి సారిగా ఓటు వేసింది తెలుగుదేశం పార్టీకేనని, పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు టీడీపీతోనే ప్రయాణం సాగించానని కదిరి స్పష్టం చేశారు.

కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న తనను మరో చోటికి పంపారన్నారు. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం వైఎస్సార్‌సీపీ ప్రాబల్యం ఉన్న స్థానమని అలాంటి చోట తాను 12 వేల భారీ మెజారిటీతో గెలిచానని బాబూరావు గుర్తుచేశారు.

Latest Videos

2019 ఎన్నికల సమయంలో కనిగిరి కాకుండా పక్కనే ఉన్న దర్శి టికెట్ ఇస్తానని చంద్రబాబు చెప్పారని.. అయితే ఇందుకు తాను అభ్యంతరం తెలిపానన్నారు. తనకు కొందరు పత్రికా ప్రముఖులతో ఉన్న అవసరాల దృష్ట్యా కనిగిరి నుంచి కాకుండా దర్శికి పంపారని చెప్పారు.

Also Read:ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఎదురు దెబ్బ: టీడీపీకి కదిరి బాబూరావు గుడ్ బై

అక్కడ పోటీలో ఉన్న మద్దిశెట్టి వేణు తనకు కజిన్ అవుతాడని అతనిపై పోటీ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పినప్పటికీ చంద్రబాబు నచ్చజెప్పి దర్శికి పంపారని బాబూరావు గుర్తుచేశారు.

వచ్చే ఎన్నికల్లో కనిగిరి ఇస్తానని గెలిచినా, ఓడినా ఎమ్మెల్సీ ఇస్తానని, ఒకవేళ ఓడిపోతే కనిగిరి ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని కదిరి బాబూరావు గుర్తుచేశారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో కనిగిరి ఇన్‌ఛార్జ్ బాధ్యతల గురించి అడిగితే టీడీపీ అధినేత దాటవేస్తూ వచ్చి నమ్మక ద్రోహం చేశారని బాబూరావు ఆరోపించారు.

నమ్మించి ద్రోహం చేయడంలో చంద్రబాబు దిట్ట కాబట్టి ఆయన నుంచి దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే వైసీపీలో చేరానని ఆయన స్పష్టం చేశారు. 2014లోనే పార్టీలో చేరాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానాలు అందాయని తెలిపారు.

చంద్రబాబు నాయుడు ఎప్పటికైనా మోసం చేస్తారు వేరే నియోజకవర్గం ఇస్తామని చెప్పారని, అయితే తనకు బాలకృష్ణపై గౌరవంతో తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వచ్చానని బాబూరావు స్పష్టం చేశారు.

Also Read:టీడీపీకి సతీష్ రెడ్డి రాజీనామా: కన్నీళ్లను అదుముకొంటూ

బాలకృష్ణ తనకు అండగా నిలబడినప్పటికీ ఆయన చెప్పిన మాటను కూడా చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదన్నారు. నందమూరి- నారా కుటుంబాలకు ఎంతో తేడా వుందని బాబూరావు తెలిపారు. బాలకృష్ణతో అనుబంధాన్ని తెంచుకోవడం తనకు ఇష్టం లేదని కానీ చంద్రబాబు లాంటి వ్యక్తి వద్ద తాను ఇమడలేనని బయటకు వచ్చేశానని కదిరి చెప్పారు.

తెలుగుదేశం పార్టీతో 34 ఏళ్ల అనుబంధం తెంచుకోవడం బాధగా ఉందని.. పదవులు ఆశించి వైసీపీలోకి రావడం లేదని కేవలం జగన్‌పై ఉన్న నమ్మకంతోనే పార్టీలోకి వస్తున్నట్లు బాబూరావు స్పష్టం చేశారు. బాలకృష్ణ ఎంతో మంచి వ్యక్తి, అమాయకుడని ఆయనను ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నారో తనకు తెలియదంటూ బాబూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 

click me!