ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. వారిద్దరూ కేంద్రానికి పూర్తిగా సరెండర్ అయ్యారని ఆయన దుయ్యబట్టారు.
పోలవరం ప్రాజెక్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని, ఇంకా పునాదుల్లోనే వుందన్నారు. ఉమ్మడి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్ వంటి వాటిని తీర్మానం ప్రస్తావించి, రాష్ట్ర విభజన చేశారని అరుణ్ కుమార్ వెల్లడించారు. ఉమ్మడి రాజధానిగా వున్న హైదరాబాద్ నుంచి ఏడాదిలోనే బయటకు వచ్చేశామని ఆయన గుర్తుచేశారు. దుగరాజపట్నం పోర్ట్, ఇంటర్నేషనల్ విమానాశ్రయాలను కనీసం ప్రారంభించలేదని అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ ఇస్తామని చెప్పి మోసం చేశరని దుయ్యబట్టారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వున్న ప్రభుత్వాలు బీజేపీ, మోడీకి అనుకూలంగానే వున్నాయని ఉండవల్లి చురకలంటించారు. కేంద్రాన్ని విమర్శించే స్థాయిలో అధికార, ప్రతిపక్షాలు లేవని.. కనీసం ఒక్క శాతం కూడా ఓట్లు లేని కేంద్ర ప్రభుత్వం ఏపీలో చాలా బలంగా వుందని అరుణ్ కుమార్ దుయ్యబట్టారు. టీడీపీ, వైసీపీల బలం కూడా కేంద్రానికి వుందని.. అవిశ్వాస తీర్మానాన్ని గట్టిగా ఎక్స్‌పోజ్ చేయాలంటే ఏపీ ప్రభుత్వమే చేయాలని ఆయన పేర్కొన్నారు. కేంద్రానికి ఇంత త్వరగా లొంగిపోవాల్సిన అవసరం లేదని.. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా అడగలేకపోతున్నారని అరుణ్ కుమార్ మండిపడ్డారు.
జగన్, చంద్రబాబు కూడా కేంద్రానికి పూర్తిగా సరెండర్ అయ్యారని అనిపిస్తోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజ్ ప్రకారం.. రాష్ట్రానికి రూ.24,350 కోట్లు రావాల్సి వుందని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన దారుణమైన స్ధితిలో జరిగిందని.. షోరూం తెలంగాణకు వస్తే, గోడౌన్ ఆంధ్రాకు వచ్చిందని ఆయన సెటైర్లు వేశారు. కేంద్రంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వినియోగించుకోవాలని ఉండవల్లి సూచించారు.