ఆ పార్టీలోకే వెళ్తా, లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా: తేల్చేసిన మాజీ ఎంపీ సబ్బం హరి

By Nagaraju penumalaFirst Published Feb 23, 2019, 9:50 AM IST
Highlights

తనకు రెండే ఆప్షన్లు ఉన్నాయని వెళ్తే టీడీపీలోకి వెళ్లడం లేదా రాజకీయాల నుంచి తప్పుకోవడమేనన్నారు. రాష్ట్రానికి ఉపయోగపడే ప్రభుత్వానికి ఆవగింజ అంతైనా సాయం చేస్తానని, పార్టీల్లో లేకపోతే బయటి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. 

విశాఖపట్నం: ఏపీలో రాజకీయాలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తటస్థంగా ఉన్న నేతలంతా ఒక్కొక్కరూ దారులు వెతుక్కుంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా దూరంగా ఉన్న నేతలు ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి బెర్త్ లు కన్ఫమ్ చేసుకునే పనిలో పడ్డారు. 

ఇదే కోవలో చేరిపోయారు అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్తున్న సబ్బం హరి ఏ పార్టీలో చేరబోతున్నారనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. గతంలో వైఎస్ జగన్ ను పొగిడిన సబ్బం హరి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను కూడా పొగడ్తలతో ముంచెత్తారు. 

తాజాగా గత కొద్ది రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబును  పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఎన్నికలు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం దగ్గర్లో ఉండటంతో ఆయన ఇక తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరతానని  ప్రకటించారు. 

తనకు రెండే ఆప్షన్లు ఉన్నాయని వెళ్తే టీడీపీలోకి వెళ్లడం లేదా రాజకీయాల నుంచి తప్పుకోవడమేనన్నారు. రాష్ట్రానికి ఉపయోగపడే ప్రభుత్వానికి ఆవగింజ అంతైనా సాయం చేస్తానని, పార్టీల్లో లేకపోతే బయటి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. 

ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వంపై సబ్బం హరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు గురించి ఎంపీ జీవీఎల్ నరసింహరావు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రానికి వచ్చే ప్రతి రూపాయి రాష్ట్రాల నుంచే వస్తుందని తెలిపారు.

ప్రధాని మోదీ వాళ్ల తాతలు సంపాదించిన ఆస్తిని ఏమైనా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. పోలవరానికి తాము ఖర్చు పెట్టిన డబ్బు ఇవ్వమన్నా కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని సబ్బంహరి ఆరోపించారు.

సబ్బం హరి తెలుగుదేశం పార్టీ తరపున అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి చేరిన నేపథ్యంలో సబ్బం హరికి రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి కూడా పోటీ చెయ్యాలని సబ్బం హరి భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరే ముందే సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయి సీటుపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది వేచి చూడాలి.  
     
 

click me!