
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిమానుల పేరిట కొంత మంది తనను బెదిరిస్తున్నారని, ఇదే విధంగా బెదిరింపులు కొనసాగితే జగన్ బండారం బయటపెడుతానని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాజకీయ నేత గోనే ప్రకాశ్ రావు చెప్పారు. విదేశాల్లో కూర్చుని తనపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, దమ్ముంటే వారు తన ముందుకు చర్చకు రావాలని ఆయన అన్నారు.
తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జగన్ పాలనకు, వైఎస్ పాలనకు మధ్య నక్కకు నాకలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు ఆళ్ల రామకృష్ణా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారని, విజయసాయి రెడ్డి ఫైనాన్స్ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
సిఎం జగన్ అక్రమాస్తులపై నమోదైన సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ రద్దు కావడం ఖాయమని ఆయన అన్నారు. జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని ఆయన ఆరోపించారు.
వైఎస్ పాదయాత్రలో జగన్ పాల్గొనలేదని ఆయన చెప్పారు. నాలో... నాతో వైఎస్సార్ పుస్తకంలో తండ్రికి అండగా జగన్ పాదయాత్ర చేశారని విజయమ్మ రాయడాన్ని ఆయన తప్పు పట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో తాను, తిరుపతి ప్రస్తుత ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ప్రారంభం నుంచి చివరకు ఉన్నామని ఆయన చెప్పారు.