ఆస్తులను దోచుకునేందుకు... పరిపాలనా రాజధాని ముసుగు : జగన్‌పై యనమల వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 26, 2022, 3:53 PM IST
Highlights

పరిపాలనా రాజధాని ముసుగులో ఉత్తరాంధ్ర భూములను ఆస్తులను దోచుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అమరావతి అంటే జగన్‌కు ఎందుకంత కక్ష అని యనమల ప్రశ్నించారు. 

వైసీపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కోరుకోవడం లేదని... వారికి కావాల్సిన అభివృద్ధిని జగన్ రెడ్డి చేయడం లేదని యనమల ఎద్దేవా చేశారు. అమరావతి రైతుల పాదయాత్రకు వస్తోన్న స్పందనను చూసి తట్టుకోలేక... దీనిని అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని రామకృష్ణుడు ఆరోపించారు. రైతులపై దాడులు చేయించడంతో పాటు నానా మాటలు అన్నారని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతి అంటే జగన్‌కు ఎందుకంత కక్ష అని యనమల ప్రశ్నించారు. 

ALso Read:నేను నాయకుడిని అవుతానని భయపడొద్దు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను : ధర్మాన సంచలన వ్యాఖ్యలు

మూడు రాజధానుల గురించి మాట్లాడే అర్హత వైసీపీ ఎమ్మెల్యేలకు లేదని.. హైకోర్ట్ పరిధిలో విషయం వున్నప్పుడు మూడు రాజధానుల గురించి ఎలా మాట్లాడుతారని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని యనమల దుయ్యబట్టారు. వైసీపీ చేసిన ఈ చర్య కోర్టు ధిక్కారమేనని రామకృష్ణుడు పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయంగా గెలుపొందడం కోసమే వైసీపీ నేతలు ఆందోళనకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. పరిపాలనా రాజధాని ముసుగులో ఉత్తరాంధ్ర భూములను ఆస్తులను దోచుకుంటున్నారని... ఆంధ్రప్రదేశ్‌ను కాపాడాలని యనమల డిమాండ్ చేశారు. 

ఇకపోతే... దశాబ్ధాల వెనుకబాటుతనం పోవాలంటే వికేంద్రీకరణే మార్గమన్నారు వైసీపీ సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆదివారం మూడు రాజధానులపై శ్రీకాకుళంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితే విభజన ఉద్యమం వచ్చేది కాదని ధర్మాన పేర్కొన్నారు. భారీ ఖర్చుతో ఏపీకి రాజధాని నిర్మాణం వద్దని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని... అయినా రూ.లక్షల కోట్ల ఖర్చుతో అమరావతి ప్రతిపాదన చేశారని ధర్మాన మండిపడ్డారు. 

ఉత్తరాంధ్రకు రాజధాని వద్దని చెప్పే వాళ్లెవరైనా ఆ ప్రాంతానికి ద్రోహం చేస్తున్నట్లే లెక్క అని ఆయన పేర్కొన్నారు. ఇడుపులపాయలో రాజధాని పెట్టాలని జగన్ కోరుకోవడం లేదని.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెడితే తెలుగుదేశం పార్టీకి అభ్యంతరం ఏంటని ఆయన ప్రశ్నించారు. 23 కేంద్ర సంస్థల్లో ఒక్కటి కూడా ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయలేదని ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మాన ప్రసాదరావు నాయకుడవుతాడన్న ఆలోచన చేయొద్దని... వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా వుండాలని భావిస్తున్నట్లు ప్రసాదరావు తెలిపారు. 
 

click me!