
టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని (perni nani). శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరద బురదలోనూ రాజకీయాలు ఎత్తుకునే వ్యక్తి చంద్రబాబు అంటూ సెటైర్లు వేశారు. వరద ప్రాంతాల్లో పర్యటనలో ఒక్క ఓదార్పు మాటైనా మాట్లాడావా చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. అధికారం ఇస్తే పోలవరం ముంపు ప్రాంతాలన్నింటినీ ఒక జిల్లా చేస్తావా అని పేర్ని నాని ప్రశ్నించారు. మరి 2014-19 వరకు అధికారంలో ఉండగా ఆ పని ఎందుకు చేయలేకపోయావు అంటూ నిలదీశారు. ఇప్పుడే చంద్రబాబుకి ముంపు ప్రాంతాలు గుర్తుకు వచ్చాయా అని పేర్ని నాని ప్రశ్నించారు.
13 యేళ్లు సీఎంగా, 13 యేళ్లు ప్రతిపక్ష నేతగా 40 యేళ్ల రాజకీయ చరిత్రలో పోలవరం ముంపు ప్రాంతమైన యటపాక ఎప్పుడైనా వెళ్లారా అని ఆయన దుయ్యబట్టారు. వరద బాధితుల పట్ల చంద్రబాబువన్నీ ముసలి కన్నీరేనని పేర్ని నాని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండగా వారం వారం పోలవరం వెళ్లావ్ కదా అప్పుడైనా యటపాక వెళ్లావా అని ఆయన నిలదీశారు. 1996లోనూ యటపాక వరదకు మునిగిపోయింది కదా..? అప్పుడు సీఎంగా ఎందుకు చంద్రబాబు వెళ్లలేదని పేర్ని నాని చురకలు వేశారు.
ALso REad:చంద్రబాబును జనం డస్ట్ బిన్‌లో పడేశారు... పోలవరానికి జగన్ నిధులు సంపాదిస్తారు: సజ్జల వ్యాఖ్యలు
చంద్రబాబుకు సరిపోయే పేరు నారా గజిని అంటూ పేర్ని నాని సెటైర్లు వేశారు. చంద్రబాబు బకెట్, చీపురు, చాట పట్టుకుని ఇల్లిల్లు కడిగారా అంటూ ప్రశ్నించారు. హుదుద్, తిత్లీ తుఫాన్లలో జీవోలు తప్పించి బాబు ఏమిచ్చారని పేర్ని నాని నిలదీశారు. తనకన్నా చంద్రబాబే పెద్దనటుడని ఎన్టీఆరే చెప్పారని మాజీ మంత్రి చురకలు వేశారు. పోలవరమంటే చంద్రబాబుకు ఏటీఎం అని స్వయంగా ప్రధాని మోదీనే చప్పట్లు కొట్టి మరీ చెప్పారని.. ఆయనకు చిల్లర మీద ధ్యాస తప్పితే ప్రజల మీద ధ్యాసలేదని పేర్ని నాని ధ్వజమెత్తారు.
అంతకుముందు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చరిత్ర హీనుడని.. ఆయనను ప్రజలు చెత్త బుట్టలో పడేశారని దుయ్యబట్టారు. అధికారంలో వుండగా.. పోలవరం ప్రాజెక్ట్ (polavaram) , ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు రాజీనామా ఎందుకు చేయలేదని సజ్జల నిలదీశారు. ప్రణాళిక ప్రకారం పోలవరం ఆర్ అండ్ ఆర్ గురించి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారని రామకృష్ణారెడ్డి అన్నారు. కేంద్రం నుంచి నిధులు రావడం ఆలస్యమైనా 41.5 అడుగుల వరకు ఆర్ అండ్ ఆర్‌ను తాను భరిస్తానని సీఎం చెప్పారని సజ్జల గుర్తుచేశారు. 45.5 అడుగుల వరకు నీటిని నింపాలంటే రెండేళ్ల సమయం పడుతుందని.. అప్పటి లోగా కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని రామకృష్ణారెడ్డి అన్నారు.