చంద్రబాబు ‘‘సైకిల్‌’’ దొంగ .. మహానాడులో అన్ని సుత్తిమాటలే : పేర్ని నాని సెటైర్లు

By Siva KodatiFirst Published May 27, 2023, 9:30 PM IST
Highlights

సైకిల్ సృష్టికర్త ఎన్టీఆర్ అని దానిని చంద్రబాబు నాయుడు దొంగతనం చేశారని సెటైర్లు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు ఇవాళ నిర్వహించే మహానాడు కేవలం చందాలు, భోజనాల కోసమేనన్నారు. 

రాజమండ్రిలో జరుగుతున్న టీడీపీ మహానాడుపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో శ్రీకాకుళం నుంచి తడ వరకు చంద్రబాబు ఏం సంపద సృష్టించారని చురకలంటించారు. ఆయన పాలనలో రాష్ట్రానికి అప్పులు తప్ప ఒరిగిందేమీ లేదని.. మహానాడులో చంద్రబాబు ఉపన్యాసమంతా ఆత్మస్తుతి, పరనిందలా సాగిందన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌లో వున్నారని ఎద్దేవా చేశారు. సైకిల్ సృష్టికర్త ఎన్టీఆర్ అన్న పేర్నినాని.. దానిని రామారావు నుంచి చంద్రబాబు దొంగిలించారని విమర్శించారు. 

చంద్రబాబు దేశంలోనే ధనిక రాజకీయ నాయకుడని పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబుకు ఆయన తండ్రి ఇచ్చింది రెండెకరాలేనని.. అలాంటిది మరి రూ.1000 కోట్ల ఆస్తి ఎక్కడిదని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికల అఫిడవిట్, ఆయన కుటుంబ సభ్యుల ఇన్‌కం ట్యాక్స్ రిపోర్డులు చూసినా ఆయన సంపద ఎంతో తెలిసిపోతుందని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని ముక్కలు చేయడంతో పాటు ఆయనను గద్దె దించేందుకు రామోజీరావుతో కలిసి కుట్రలు పన్నారని పేర్ని నాని ఆరోపించారు.

Also Read: విశాఖకు రాజధాని వచ్చేసింది.. మనుషులే రావాలి : మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నాయని.. కేడర్‌కు సుత్తి మాటలు చెబుతున్నారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు ఇవాళ నిర్వహించే మహానాడు కేవలం చందాలు, భోజనాల కోసమేనని పేర్నినాని ఆరోపించారు. ఏపీ చరిత్రలో కేవలం ఎన్టీఆర్, వైఎస్ఆర్ శకాలు మాత్రమే వున్నాయని, భవిష్యత్తులో జగన్ శకం కూడా వస్తుందని.. చంద్రబాబు శకం వుండదన్నారు. 

అంతకుముందు మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. తాను నిండు నూరేళ్లు జీవించి వుండేవాడిని అని ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందన్నారు. మళ్లీ ప్రాణం పోస్తే చంద్రబాబును సమాధి చేస్తానని ఎన్టీఆర్ దేవుడిని కోరుకుని వుంటారని జోగి రమేష్ పేర్కొన్నారు. తామే చెప్పులు వేసి, చిత్రవధ చేసి చంపిన వ్యక్తికి శతజయంతి పేరుతో వాళ్లే దండలు వేసి దండాలు పెడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారంటూ జోగి రమేష్ ఆరోపించారు. తన పాలనలో పేదలకు ఒక సెంటు స్థలం కూడా ఇవ్వలేదని.. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. 
 

click me!