
తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి కౌంటరిచ్చారు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. బోగస్ ఓట్ల వ్యవహారంపై మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాతో పేర్ని నాని ఆధ్వర్యంలో వైసీపీ నేతల బృందం భేటీ అయ్యింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పదవి పోయిన ఒకరు ఇక్కడకొచ్చి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. యూపీలో బీజేపీ చేసినట్లు తాము చేస్తున్నాం అని ఆయన అనుకుంటున్నాడని నాని దుయ్యబట్టారు. చంద్రబాబు దగ్గర కొందరు జీతానికి పనిచేస్తున్నారని.. తాము దొంగ ఓట్లను చేరిస్తే ఓటర్ల సంఖ్య ఎందుకు పెరగలేదని పేర్ని నాని ప్రశ్నించారు.
గత కొద్దిరోజులుగా చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణలు ఓటర్ల జాబితాలో అక్రమాలు అంటూ ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. వేర్వేరు నియోజకవర్గాలు, వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్న ఒకే వ్యక్తికి అధిక ఓట్లు వున్నాయన్నారు. ఓటరు కార్డ్‌కి ఆధార్ కార్డ్ అనుసంధానం చేయాలని కోరామని.. విజయవాడ సెంట్రల్‌లో ఒకే ఇంట్లో 510 ఓట్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో నమోదయ్యాయని నాని చెప్పారు. తెలుగుదేశం అధికారంలో వున్నప్పుడు రామోజీరావు దృతరాష్ట్రుడు అయ్యాడా అని ఆయన ప్రశ్నించారు. ఈసీని కలిసిన వారిలో వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, అనిల్ కుమార్ , లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ తదితరులు వున్నారు.
ALso Read; ఆ కారణంతోనే ఉపాధ్యాయుల వేతనాలు ఆలస్యం.. మంత్రి బొత్స సత్యనారాయణ
చంద్రబాబుకు ఐటీ నోటీసులపై పేర్ని నాని స్పందిస్తూ.. టీడీపీ హయాంలో అడ్డగోలుగా ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్, రాజధాని అసైన్డ్ భూముల్లో అవినీతి జరిగిందని మా దృష్టికి వచ్చిందన్నారు. అవినీతి కేసులపై తాము సిట్ వేశామని.. డొల్ల కంపెనీల నుంచి చంద్రబాబుకు ముడుపులు అందాయని సీఐడీ విచారణలో చూశామని నాని తెలిపారు. ప్రజా ధనం డొల్ల కంపెనీలు, హవాలా ద్వారా చంద్రబాబుకు చేరాయని ఆయన ఆరోపించారు.
ఇటీవల ఇన్‌ఫ్రా సంస్థల నుంచి ముడుపులు అందాయని ఐటీ శాఖ నోటీసుల ద్వారా వెలుగులోకి వచ్చాయని పేర్ని నాని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కేసుల్లోని అవినీతి సొమ్ము ఇదే వ్యక్తులు...ఇవే డొల్ల కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేరాయన్నారు. తాము గతంలో చెప్పినవన్నీ ఒక్కొక్కటి వాస్తవ రూపం దాల్చుతున్నాయని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఈ స్కాంలన్నింటి మూలాలు ఒకే దగ్గర నుంచి జరుగుతున్నట్టు ఆధారాలు లభిస్తున్నట్టు కన్పిస్తోందన్నారు. ఈ మేరకే సిట్ నోటీసులు అందచేసింని మాజీ మంత్రి తెలిపారు.