పులివెందులలో జగన్‌ను ఓడించండి.. ఇద్దరూ కలిసి వస్తారా, విడివిడిగా వస్తారా : పవన్ - బాబులకు పేర్ని నాని సవాల్

By Siva KodatiFirst Published Apr 2, 2023, 3:05 PM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. దమ్ముంటే జగన్‌ను పులివెందులలో ఓడించాలన్నారు. 22 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలకు గాను 4 చోట్ల గెలిచి చంకలు గుద్దుకుంటున్నారని పేర్ని నాని దుయ్యబట్టారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆదివారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 175 నియోజకవర్గాల్లో సొంతంగా పోటీ చేసే దమ్ము టీడీపీకి లేదన్నారు. పదిమందిని కలుపుకుంటేనేగాని చంద్రబాబుకు అభ్యర్ధులు దొరకడం లేదని చురకలంటించారు. జగన్‌తో పోటీపడేంత ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. పవన్ కల్యాణ్, బాలకృష్ణలతో తిరిగి చంద్రబాబు సినిమా డైలాగ్స్ వదులుతున్నాడని నాని సెటైర్లు వేశారు. ఇన్నేళ్లు వచ్చిన అబద్ధాలు, ప్రగల్భాలేనా అంటూ ఆయన ప్రశ్నించారు.

వై నాట్ 175, వై నాట్ పులివెందుల వంటి డైలాగ్స్ కొడుతున్నారని.. దమ్ముంటే పులివెందులలో పోటీ చేయాలని నాని సవాల్ విసిరారు. పవన్ , చంద్రబాబు విడివిడిగా వచ్చినా పర్లేదు.. ఒప్పందం చేసుకుని ఎవరో ఒకరు వచ్చినా పర్లేదన్నారు. 22 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలకు గాను 4 చోట్ల గెలిచి చంకలు గుద్దుకుంటున్నారని పేర్ని నాని దుయ్యబట్టారు. మొత్తం ప్రపంచాన్ని గెలిచినట్లుగా, ఎవరెస్ట్ ఎక్కినంతగా సంబరాలు చేసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. జగన్‌ను కొందరు అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదిలావుండగా.. మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి పరిపాలనా సౌకర్యం కోసం కేబినెట్ ఏర్పాటు ఉంటుందని అన్నారు. కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనేది ముఖ్యమంత్రి ఇష్టమని చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసం మార్పులు- చేర్పులు ఉంటాయని తెలిపారు. దానిపై ఊహాగానాలు సరైనవి కాదని.. తనలాంటి మంత్రులు మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. ఇటీవలి ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాకు మంత్రివర్గంలో మార్పునకు సంబంధం లేదని అన్నారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తన వైఫల్యమే కారణమని చెప్పారు. లోపం ఎక్కడుందో సమీక్షించుకుంటామని తెలిపారు. ఓటమిని  వేరేవారిపైకి నెట్టడం తనకు అలవాటు లేదని చెప్పారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో మార్పుల దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే ఎన్నికలకు బలమైన కేబినెట్‌తో ఆయన రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. ఇప్పుడున్న మంత్రివర్గం.. తన తొలి కేబినెట్ కంటే వీక్‌గా వుందని ఆయన అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. విపక్షాలు చేసే విమర్శలకు ధీటుగా బదులిచ్చే వారు కరువయ్యారని సీఎం పలుమార్లు అసహనం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. అందుకే కొత్తగా ఎమ్మెల్సీలుగా గెలిచిన వారిలో సామాజిక సమీకరణలు పక్కనపెట్టి.. సమర్ధులైన వారిని కేబినెట్‌లోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. 

click me!