వైసీపీ నుంచి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని సస్పెండ్ చేశారు ఆ పార్టీ అధినేత , సీఎం వైఎస్ జగన్. తనకు వ్యక్తిగత ఓటింగ్ ఉందని నిన్న కొత్తపల్లి వ్యాఖ్యానించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న జగన్ ఆయనను సస్పెండ్ చేశారు.
వైసీపీ నుంచి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని సస్పెండ్ చేశారు ఆ పార్టీ అధినేత , సీఎం వైఎస్ జగన్. తనకు వ్యక్తిగత ఓటింగ్ ఉందని నిన్న కొత్తపల్లి వ్యాఖ్యానించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న జగన్ ఆయనను సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ కమిటీ సిఫారసుతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా.. కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం నుంచి 1989 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరుసగా నాలుగుసార్లు అక్కడ నుంచే విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అయితే 2009 ఎన్నికల సమయంలో టీడీపీని వీడి పీఆర్పీలో చేరిన ఆయన.. నర్సాపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి నర్సాపురం నుంచి మళ్లీ విజయం సాధించారు.
Also Read:కారణమిదీ: చెప్పుతో కొట్టుకొన్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు
రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరిన సుబ్బారాయుడు నర్సాపురం నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. అనంతర రాజకీయ పరిణామాలతో తిరిగి టీడీపీలో చేరి.. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కించుకున్నారు. అయితే 2019 ఎన్నికలకు ముందు మళ్లీ వైఎస్సార్‌సీపీలో చేరి.. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ముదునూరి ప్రసాదరాజుకు మద్దతు ఇచ్చారు. ఇటీవలే ప్రభుత్వం ఆయనకు గన్‌మెన్‌లను తొలగించింది.
ఈ నేపథ్యంలో నిన్న మీడియాతో మాట్లాడిన కొత్తపల్లి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు. నర్సాపురం నుంచే పోటీ చేస్తానని.. ఏ పార్టీ తరపున పోటీ చేస్తానన్న విషయం మాత్రం చెప్పలేనని వెల్లడించారు. ఒకవేళ ఎవరూ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటానని కొత్తపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తనకు మంచి పట్టు ఉందని .. అన్ని కులాల్లో తనకు పడే ఓట్లు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న సమయంలోనూ నర్సాపురం నుంచి సొంతంగా గెలిచానని కొత్తపల్లి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న వైసీపీ అధిష్టానం.. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేసింది.