నేనూ, షర్మిల వైసీపీలోనే వుండాల్సింది.. కానీ : కొణతాల రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Jan 24, 2024, 7:21 PM IST

వైఎస్ షర్మిలతో భేటీ వ్యక్తిగతమన్నారు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ. తానూ, షర్మిల కూడా వైసీపీలో ఉండాల్సిన వాళ్లమేనని, కానీ తామే బయటకు వచ్చేశామంటే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలన్నారు.


వైఎస్ షర్మిలతో భేటీ వ్యక్తిగతమన్నారు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ. బుధవారం మంగళగిరిలోని జనసేన  కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో కొణతాల భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మంచి అనుబంధం వుందని, తాము సొంత కుటుంబసభ్యుల్లా వుండేవాళ్లమన్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల తనను కలవడానికి వచ్చినట్లు రామకృష్ణ తెలిపారు. షర్మిల పీసీసీ చీఫ్ అయ్యారని తాను రాలేదని, ఇప్పటికీ విజయమ్మ తనతో మాట్లాడుతుంటారని కొణతాల వెల్లడించారు. 

తన కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు షర్మిల వచ్చారని , ఆమె ఏ పరిస్ధితుల్లో కాంగ్రెస్‌లో చేరాల్సి వచ్చిందో వివరించారని రామకృష్ణ తెలిపారు. విజయమ్మను అక్కలా భావిస్తానని, అందువల్ల తన ఇంటికి మేనకోడలు వచ్చినట్లుగానే భావిస్తానని ఆయన పేర్కొన్నారు. తాను ఎక్కడ వున్నా ఉత్తరాంధ్ర సమస్యలపై మాట్లాడుతూ వుంటాననే విషయాన్ని రామకృష్ణ స్పష్టం చేశారు. 

Latest Videos

పోలవరం ప్రాజెక్ట్‌ను వైఎస్ ప్రారంభించారని, చంద్రబాబు దానిని 70 శాతం వరకు పూర్తి చేశారని ఆయన పేర్కొన్నారు. అలాంటిది ఈ నాలుగున్నరేళ్లలో ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేకపోయారని కొణతాల దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్ట్‌ను జగన్ కేంద్రానికి అప్పగించలేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రామకృష్ణ స్పష్టం చేశారు. జగన్ తన  తండ్రి బాటలో వెళ్లి వుంటే బాగుండేదని, ఏపీలో కాంగ్రెస్ పరిస్ధితి ఏంటనేది కాలమే నిర్ణయిస్తుందని కొణతాల పేర్కొన్నారు. 

ఉత్తరాంధ్ర సమస్యలపై పవన్‌తో చర్చించామని.. ఉత్తరాంధ్రను దత్తత తీసుకోమని ఆయన్ను కోరానని రామకృష్ణ తెలిపారు. వచ్చే నెల 2 లేదా 4 తేదీల్లో అనకాపల్లిలో పవన్ బహిరంగ సభ ఉండే అవకాశం వుందని ఆయన పేర్కొన్నారు. తాను ఇప్పటికే జనసేనలో చేరినట్టేనని, ఉత్తరాంధ్ర నుంచి పవన్ పోటీ చేస్తే చాలా మంచిదని కొణతాల అభిప్రాయపడ్డారు. మేమైతే పవన్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలనే కోరుకుంటామని, పీసీసీ హోదాలో ఉన్న షర్మిల తనను పార్టీలోకి ఆహ్వానించారని రామకృష్ణ తెలిపారు. 

జనసేనలో చేరుతున్నందున కాంగ్రెస్ పార్టీలోకి రాలేనని చెప్పానని.. జగన్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్లు ఏ పార్టీలో చేరినా ఫర్వాలేదు కానీ.. ఆ పార్టీలో ఎవ్వరూ ఉండకూడదని కొణతాల అభిప్రాయపడ్డారు. తానూ, షర్మిల కూడా వైసీపీలో ఉండాల్సిన వాళ్లమేనని, కానీ తామే బయటకు వచ్చేశామంటే అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలన్నారు. వైఎస్ స్టీల్ ప్లాంటుని విస్తరించాలనుకుంటే.. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నా జగన్ సైలెంటుగానే ఉన్నారని రామకృష్ణ ధ్వజమెత్తారు. వైఎస్ హయాంలో వచ్చిన గంగవరం పోర్టులోని ప్రభుత్వ వాటాను కూడా  జగన్ అమ్మేశారని ఎద్దేవా చేశారు. 


 

click me!