ఇచ్చింది సెంటు స్థలం... నచ్చినట్లుగా ఇళ్లు కుదురుతుందా : వైసీపీపై కాల్వ శ్రీనివాసులు ఫైర్

By Siva KodatiFirst Published Nov 14, 2022, 5:08 PM IST
Highlights

జగనన్న కాలనీలు, ఇళ్ల నిర్మాణంపై మాజీ మంత్రి, టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఇచ్చిన సెంటు స్థలంలో అభిరుచులకు అనుగుణంగా ఇళ్లు నిర్మించడం సాధ్యం కాదన్నారు.

జగనన్న కాలనీలు, అక్కడి వసతులపై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఏపీలో పేదవాడి పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తిగా పడకేసిందన్నారు. ఐదేళ్లలో పాతిక లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని వైసీపీ నాయకులు ఊదరగొట్టారని.. కానీ ఈ మూడేళ్లలో ప్రభుత్వం ప్రారంభించి పూర్తి చేసిన ఇళ్లు 60 వేలు కూడా లేవన్నారు. ఎన్నికలకు కొద్ది నెలలే వున్న సమయంలో గృహాల నిర్మాణానికి అవకాశం లేదని శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. 28,30,000 మంది ఇళ్లు లేని పేదలుంటే 80 వేల ఇళ్లు కూడా పూర్తి చేయలేదని... 2019- 20 బడ్జెట్‌లో రూ.3,600 కోట్లు కేటాయిస్తే, ఖర్చు చేసింది మాత్రం రూ.760 కోట్లు మాత్రమేనన్నారు. 2020-21లో రూ.3,690 కోట్లు కేటాయించి రూ.1,141 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. 

ఒక్కొక్క ఇంటికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారం నిర్మించుకోవాలన్నా దాదాపు రూ.5 లక్షలు కావాలన్నారు. వీటిని సమకూర్చుకోలేక ప్రజలు సతమతమౌతున్నారని.. జగన్ ఇచ్చిన సెంటు స్థలంలో అభిరుచులకు అనుగుణంగా ఇళ్లు నిర్మించడం సాధ్యం కాదన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తే తప్ప ఈ పేదల ఇళ్ల నిర్మాణ పథకం ముందుకు సాగే అవకాశం లేదని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. 

ALso REad:నీవేమైనా పుడింగివా,యుగ పురుషుడివా?:పవన్ కళ్యాణ్ పై బొత్స ఫైర్

అంతకుముందు ఆదివారం మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ... పేదలకు ఇళ్లు ఇస్తుంటే మీకెందుకు కడుపు మంట అని ప్రశ్నించారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని జోగి రమేశ్ ప్రశంసించారు. పవన్ కల్యాణ్ ప్రశ్నించాల్సింది మమ్మల్ని కాదని.. చంద్రబాబునని ఆయన చురకలంటించారు. పిల్ల సైకోలను పోగేసుకొని వచ్చి మీటింగ్ పెడతారా అని జోగి రమేశ్ మండిపడ్డారు. పిల్ల సైకోలను టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు తరిమికొట్టారని ఆయన పేర్కొన్నారు. 

జరుగుతున్న నిర్మాణ పనులు పవన్‌కు ఎందుకు కనబడటం లేదని జోగి రమేశ్ ప్రశ్నించారు. దుర్మార్గంగా ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారని.. 2014లో ఒక్కరికి కూడా స్థలం ఇవ్వని చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి నిలదీశారు. ఆ రోజు ప్రశ్నిస్తానన్న పవన్ ఏం చేశారని జోగి రమేశ్ ధ్వజమెత్తారు. ఇప్పుడు పేదలకు మంచి చేస్తున్న మమ్మల్ని ప్రశ్నిస్తున్నావా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. పాదయాత్రలో పేదల కష్టాలు చూసి జగన్ ఇళ్లు ఇస్తున్నారని మంత్రి ప్రశంసించారు. 

click me!