కరోనా వైరస్సా.. కమ్మ వైరస్సా అని హేళన చేశారు, మరి ఇప్పుడు: వైసీపీ నేతల ‌పై దేవినేని వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 25, 2020, 4:01 PM IST
Highlights

రాష్ట్రంలో కేసులు పెరిగాయి - మరణాలు పెరిగాయన్నారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు. శనివారం రాష్ట్రంలో కేసుల తీవ్రత దృష్ట్యా ప్రజల ఆందోళనను ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. 

రాష్ట్రంలో కేసులు పెరిగాయి - మరణాలు పెరిగాయన్నారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు. శనివారం రాష్ట్రంలో కేసుల తీవ్రత దృష్ట్యా ప్రజల ఆందోళనను ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఉమా తెదేపా నేతలతో కలసి స్వయంగా అందజేసారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మార్చి నెలలో ఏపీలో ఐదారు కేసులుంటే ఇప్పుడా సంఖ్య రోజుకు పదివేలు చేరిందని, ఇప్పటి వరకు 80వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఉమా చెప్పారు.

కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పినందుకు తెదేపా నాయకులపై వైకాపా అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు దాడి చేసారని, కరోనా వైరస్సా ? కమ్మ వైరస్సా ? అని హేళనగా మాట్లాడారని ఆయన పేర్కొన్నారు.

Also Read:జగన్ చేష్టలు... పాకిస్తాన్ కూడా భారత్‌ని ఎగతాళి చేస్తోంది: దీపక్ రెడ్డి వ్యాఖ్యలు

హేళన చేసిన అధికార పార్టీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు ఎక్కడని ఉమా ప్రశ్నించారు. కోవిడ్ నుంచి ప్రజలను కాపాడేందుకు ఎన్నికలను వాయిదా వేసిన పుణ్యానికి ఎన్నికల అధికారి రమేష్ కుమార్ ను బండబూతులు తిట్టారని దేవినేని తెలిపారు.

కోవిడ్ సోకడంతో అధికార పార్టీ నాయకులు ఇతర రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చుపెట్టి వైద్య సౌకర్యాలు పొందుతున్నారని, ఏపీ ప్రజలను మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద చెట్ల కింద పడుకోబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

అనంతపురం, కర్నూల్ వంటి కోవిడ్ మరణాలు హృదయాలను కలచివేస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి మాత్రం చీమకుట్టినట్లైనా లేదని ఉమా తెలిపారు. రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి కరోనా నియంత్రణకు కార్యాచరణ రూపొందించాలని ఆయన డిమాండ్ చేసారు.

ఈ కార్యాక్రమంలో తెదేపా నేతలు బచ్చుల అర్జునుడు, గద్దే రామమోహన్, లుక్కాసాయిరాం ప్రసాద్ గౌడ్, కొత్త నాగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

click me!