
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి ధర్మవరపు కొండన్న శనివారం ఉదయం కన్నుమూశారు.
గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కొండన్న.. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. అనంతపురంలోని నసనకోట ముత్యాలమ్మ ఆలయ కమిటీ ఛైర్మన్‌గా కొండన్న సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. ఈ ఆలయ అభివృద్ధిలో ఆయన కీలకపాత్ర పోషించారు.
ఆయన మరణంతో పరిటాల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సునీత భర్త, దివంగత పరిటాల రవి మరణం తర్వాత ఆ కుటుంబానికి కొండన్న పెద్ద దిక్కుగా వుంటూ వస్తున్నారు. ఆయన మరణవార్త తెలుసుకున్న టీడీపీ చీఫ్, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సహా పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.
టీడీపీ నేత మాజీ మంత్రి పరిటాల సునీత గారి తండ్రి శ్రీ కొండన్న గారు మృతి చెందటం బాధాకరం. సునీత గారి కుటుంబానికి కొండంత అండగా నిలిచిన కొండన్న గారి మరణం పరిటాల కుటుంబానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, సునీత గారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అని నారా లోకేశ్ ట్వీట్టర్‌లో సంతాపం తెలిపారు.