
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించే బాధ్యత వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిదేనని వ్యాఖ్యానించారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే ముఖ్య కారకులు వాలంటీర్లేనని చెప్పారు. అదే విధంగా మంత్రి పదవి నుంచి తొలగించడంపై కూడా బాలినేని స్పందించారు. మంత్రి పదవి నుంచి ఎందుకు తీసేశారని కొందరు అడుతున్నారని.. బంధువు కాబట్టి మంత్రి పదవి నుంచి తొలగించానని సీఎం జగన్ చెబుతున్నారని బాలినేని చెప్పుకొచ్చారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం జగన్.. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారని బాలినేని చెప్పారు. వైసీపీ బలోపేతానికి జిల్లాలో గడపగడపకు తాను తిరుగుతానని ఆయన స్పష్టం చేశారు. తనను గెలిపించే బాధ్యత వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిదేనని బాలినేని చెప్పారు.
ఇక, సీఎం వైఎస్ జగన్ ఇటీవల మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. తొలి దఫాలో మంత్రిగా పనిచేసిన తనకు మరోసారి జగన్ అవకాశం కల్పిస్తారని బాలినేని భావించారు. అయితే బాలినేనికి కేబినెట్‌లో చోటు దక్కలేదు. దీంతో బాలినేని అనుచరులు నిరసన తెలియజేశారు. దీంతో బాలినేని అసంతృప్తికి లోనయ్యారనే వార్తలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బాలినేనితో చర్చలు జరిపారు. మూడు సార్లు ఆయన ఇంటికి వెళ్లి చర్చించారు.
ఈ క్రమంలోనే సీఎం జగన్ స్వయంగా బాలినేని క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన బాలినేని.. మంత్రి రాకపోవడంతో కాస్త బాధపడ్డ విషయం నిజమేనని, కానీ రాజీనామా చేస్తున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. అంతేకాకుండా ప్రకాశం జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో తనకెప్పుడు విభేదాలు లేవని, మీడియాలో తప్పుడు కథనాలు వచ్చాయన్నారు. వైఎస్సార్ కుటుంబానికి తాము ఎప్పటినుంచో సన్నిహితులమని, వారికి విధేయులుగానే ఉంటామని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ ఏ బాధ్యతలు అప్పగించిన నిర్వర్తిస్తామని చెప్పారు.