
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తలుపులు తెరిస్తే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు తప్ప ఎవరూ మిగలరని వ్యాఖ్యానించారు. 40 మంది మా ఎమ్మెల్యేలు టీడీపీకి టచ్‌లో వుంటే ఇద్దరు ఎమ్మెల్యేలనే ఎందుకు కొనుక్కున్నారని బాలినేని ప్రశ్నించారు. ఒంగోలులో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంది టీడీపీయేనని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. పేదల స్థలాలపై టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లారని దేవుడి మీద ప్రమాణం చేస్తానని.. తెలుగుదేశం నేతలు అది తప్పని నిరూపిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.
సంక్షేమ పథకాలతో రాష్ట్రం అప్పుల పాలైందని చంద్రబాబు అంటున్నారని.. గత ప్రభుత్వ హయాంలో వున్న అప్పులు ఎంత, ఎప్పుడు తీసుకున్న అప్పులు ఎంత అని బాలినేని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో తెచ్చిన అప్పులు దేని కోసం ఖర్చు పెట్టారో చెప్పాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాం కాబట్టే జనాల్లోకి ధైర్యంగా వెళ్లగలుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణ, ముందస్తు ఎన్నికలపై జరుగుతున్నదంతా మీడియా ప్రచారమేనని బాలినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు.
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ వుంటుందంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమి లేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రేపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మీదే జగన్ సమీక్షా సమావేశం నిర్వహిస్తారని నాని అన్నారు. ఎన్నికలకు ముందుకు మంత్రివర్గాన్ని మార్చడానికి జగన్ చంద్రబాబు లాంటి వ్యక్తి కాదన్నారు. ఇప్పుడున్న కేబినెట్‌తోనే తాము ఎన్నికలకు వెళ్తామని, ఎన్నికల్లో గెలుస్తామని పేర్ని నాని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఎన్నికల్లో అభ్యర్ధులు దొరకడం లేదన్నారు.
Also REad: మంత్రివర్గ విస్తరణ అవాస్తవం.. ఇప్పుడున్న కేబినెట్‌తోనే ఎన్నికలకు, జగన్‌కు ఆ ఆలోచన లేదు : పేర్ని నాని
మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల మధ్య మంత్రి సీదిరి అప్పలరాజు శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావడం ప్రాధాన్యత కలిగించింది. కేబినెట్‌లో మార్పు చేర్పులపై క్లారిటీ ఇవ్వడానికే సీఎంవో నుంచి అప్పలరాజుకు పిలుపొచ్చిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు తాను మంత్రిగా వున్నా.. లేకున్నా, మంత్రినే.. నేనే కాదు 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులేనంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ కాసేపటికీ స్పీకర్ తమ్మినేని కూడా వెళ్లడంతో వైసీపీలో ఏదో జరుగుతోందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.
కాగా.. గతేడాది వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్ధీకరించిన సంగతి తెలిసిందే . 11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించడంతో పాటు 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు . అయితే మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు అసమ్మతి గళం విన్పిస్తున్నారు. రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు. ఇప్పటికే ఈ అసంతృప్త నేతలు అధికార పార్టీని చికాకు పెడుతూనే వున్నారు.