
టీడీపీ చీఫ్ (tdp) , ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఉత్తరాంధ్ర పర్యటనపై వైసీపీ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (avanthi srinivas) ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు... గురువారం విశాఖలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అవంతి వైసీపీ (ysrcp) ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబును నమ్మే స్థితిలో జనం లేరని అవంతి ఫైర్ అయ్యారు. బషీర్ బాగ్ కాల్పుల ఘటనను చంద్రబాబు మరిచిపోయారా? అని అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. మూడు రాజధానులను అడ్డుకున్న చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ఉత్తరాంధ్రకు వచ్చారని అవంతి ప్రశ్నించారు.
కాగా.. వైసిపి సర్కార్ ప్రజలకు సంక్షేమఫలాలు అందించాల్సింది పోయి ప్రజలనే దోపిడీ చేస్తోందని ప్రతిపక్ష తెలుగుదేశం (telugu desam party) ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే సీఎం జగన్, వైసిపి ప్రభుత్వం ఇష్టారీతిన పన్నులు, నిత్యావసర ధరలు పెంచి ప్రజాధనాన్ని ఎలా దోచుకుంటున్నారో ప్రజల్లోకి వెళ్లి వివరించేందుకు బాదుడే బాదుడు పేరిట నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ పై చంద్రబాబు విరుచుకుపడ్డారు.
ఆముదాలవలసలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రాన్ని వైసిపి ప్రభుత్వం కాదు బాదుడు ప్రభుత్వం పాలిస్తోందని అన్నారు. ఆనాడు ముద్దులు - ఇప్పుడు గుద్దులు...ఇదే జగన్ పాలన అంటూ ఎద్దేవా చేసారు. జగన్ పాలనతోనే రాష్ట్రానికి అరిష్టమని... కరోనా కంటే జగన్ పాలనే ప్రమాదకరమని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు భరించలేని విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసారు.
'ఒక్క చాన్స్ అని అడిగాడు... ప్రజలంతా మాయలో పడ్డారు. ఇప్పుడు అదే చివరి ఛాన్స్ అయ్యింది. 151 ఎమ్మెల్యే సీట్లు గెలిచానని జగన్ కు మదం ఎక్కింది. అందుకే మా ఇంటిపై దాడి చేశారు... టిడిపి నేతలపైన కేసులు పెడుతున్నారు. టిడిపి దేవాలయంగా భావించే పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. నన్ను అవమానించినా పర్వాలేదు... నిండు సభలో మా కుటుంబ సభ్యులను అవమానించారు. అందుకే కౌరవ సభలో అడుగు పెట్టను అని చెప్పాను'' అని గుర్తుచేసారు. 'తిడితే భయపడం... ఖబర్దార్... జాగ్రత్తగా ఉండండి...ప్రజల ముందు నిలబెడతాం. జగన్ ను శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేస్తాం. మాపై వేధింపులపై కమిటీ వేసి అందరి సంగతి చూస్తాం'' అని చంద్రబాబు హెచ్చరించారు.