ఎమ్మిగనూరు వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా బుట్టా రేణుక .. నా విజయానికి సహకరించండి, భర్తతో కలిసి చెన్నకేశవరెడ్డితో భేటీ

By Siva Kodati  |  First Published Jan 26, 2024, 5:42 PM IST

మాజీ ఎంపీ బుట్టా రేణుకను ఎమ్మిగనూరు అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించారు జగన్. తొలుత మాచాని వెంకటేశ్‌కు బాధ్యతలు అప్పగించగా, సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సహాయ నిరాకరణకు దిగారు. దీంతో మాచానిని మార్చి ఆయన ప్లేసులో రేణుకను తీసుకొచ్చారు. 


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ దూకుడు పెంచారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పు ప్రక్రియ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. తనకున్న సమాచారం మేరకు గెలవరని తేలితే చాలు సన్నిహితులు, ఆత్మీయులు, బంధువులైనా సరే పక్కనబెట్టేస్తున్నారు జగన్. ఆర్ధిక , సామాజిక అంశాలను పరిగణనలోనికి అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ బుట్టా రేణుకను ఎమ్మిగనూరు అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించారు జగన్. తొలుత మాచాని వెంకటేశ్‌కు బాధ్యతలు అప్పగించగా, సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సహాయ నిరాకరణకు దిగారు. దీంతో మాచానిని మార్చి ఆయన ప్లేసులో రేణుకను తీసుకొచ్చారు. 

అంతకుముందు చెన్నవకేశవ రెడ్డిని క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించి జగన్ మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఎమ్మిగనూరు టికెట్ బుట్టాకు ఇస్తే సహకరిస్తానని పెద్దాయన చెప్పడంతో జగన్ వెంటనే ఆమె అభ్యర్ధిత్వానికి ఆమోదముద్ర వేశారు. వచ్చే ఎన్నికల్లో తన విజయానికి సహకరించాల్సిందిగా బుట్టా రేణుక తన భర్తతో కలిసి చెన్నకేశవరెడ్డిని కోరారు. కాగా.. బుట్టా రేణుక 2014 ఎన్నికల సమయంలో వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Latest Videos

ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత అనూహ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ.. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే మళ్లీ 2019 ఎన్నికలకు ముందుకు తెలుగుదేశాన్ని వీడి సొంతగూటికి వచ్చేశారు. అలాగే గత ఎన్నికల్లో ఎలాంటి పదవిని ఆశించకుండా పార్టీ అభ్యర్ధుల విజయం కోసం శ్రమించారు. 

మరోవైపు.. ప్రస్తుత ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీగా పోటీ చేయించాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. అయితే లోక్‌సభకు వెళ్లేందుకు జయరాం సుముఖంగా లేనట్లుగా తెలుస్తోంది. ఒకదశలో ఆయన పార్టీ మారుతారంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం.. గుమ్మనూరు స్థానంలో కర్నూలు మేయర్ బీవై రామయ్యను కర్నూలు ఎంపీగా బరిలో దించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. 
 

click me!