
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా బోగస్ ఓట్లు వున్నాయంటూ విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై తెలుగుదేశం పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తీరును విమర్శిస్తూ ఆయన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ముకేష్ కుమార్ మీనాకు లేఖ రాశారు. బోగస్ ఓట్లను నమోదు చేస్తున్నట్లు ఎన్నో ఆధారాలు కనిపిస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదని ఎల్వీ సుబ్రహ్మణ్యం నిలదీశారు. ఐదు, పదో తరగతి చదివిన వారిని కూడా పట్టభద్రులుగా చెబుతూ బోగస్ ఓటర్లను సృష్టించారని ఆయన ఆరోపించారు. బోగస్ ఓట్లు, ఎన్నికల నిర్వహణలో అవకతవకలపై విచారణ జరిపించాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు.
ఇదిలావుండగా.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా నిన్న ఇదే వ్యవహారంపై కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు లేఖ రాశారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. పలుచోట్ల వైసీపీ నేతలతో ఎన్నికల అధికారులు కుమ్మక్కు కావడంతో భారీగా బోగస్ ఓట్లు నమోదయ్యాయని సీఈసీకి ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన బోగస్ ఓట్ల జాబితాను చంద్రబాబు నాయుడు తన లేఖకు జతచేశారు. బోగస్ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చడం వల్ల ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతుందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సమయంలో కూడా బోగస్ ఓట్ల తంతు నడిచిందని అన్నారు.
ALso REad: బోగస్ ఓట్లపై తక్షణమే చర్యలు తీసుకుని అక్రమాలను అడ్డుకోవాలి: సీఈసీకి చంద్రబాబు లేఖ
తప్పుడు చిరునామాలతో వైసీపీ అభ్యర్థులకు అనుకూలంగా పెద్ద సంఖ్యలో బోగస్ ఓట్లను చేర్చారని అన్నారు. తిరుపతిలో ఓకే ఇంటి చిరునామాతో వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు నమోదు చేశారని చెప్పారు. కొందరు అధికారులు నకిలీ పత్రాలను పరిశీలించకుండానే.. ఉద్దేశపూర్వకంగానే వాటికి ఆమోదం తెలిపారని ఆరోపించారు. బోగస్ ఓట్లపై విచారణ జరపాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌ను ఏపీ ప్రధాన ఎన్నికల కమిషన్ ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.
బోగస్ ఓట్లతో ప్రజాస్వామ్యానికి, ప్రాథమిక హక్కులకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకుని.. అక్రమాలను అడ్డుకోవాలని సీఈసీని చంద్రబాబు కోరారు. బోగస్ ఓట్లు నమోదు చేసిన బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో చంద్రబాబు కోరారు.