సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వైసీసీలో చేరుతున్నారా?.. ఆయన రియాక్షన్ ఇదే..

By Sumanth Kanukula  |  First Published Oct 30, 2023, 12:04 PM IST

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? అనే చర్చ గత  రెండు రోజులు అటు సోషల్ మీడియాలో, ఇటు రాజకీయ వర్గాల్లో సాగుతుంది.


సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? అనే చర్చ గత  రెండు రోజులు అటు సోషల్ మీడియాలో, ఇటు రాజకీయ వర్గాల్లో సాగుతుంది. ఇందుకు కారణం.. ఓ కార్యక్రమానికి హాజరైన లక్ష్మీనారాయణ ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడమే. ఈ క్రమంలోనే ఆయన వైసీపీలో చేరబోతున్నారని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ కూడా చేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ క్రమంలోనే వీవీ లక్ష్మీనారాయణ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

తాను ప్రభుత్వ కార్యక్రమాలను అభినందించానని.. అంత మాత్రన తాను అధికార పార్టీలో చేరతానని తప్పుడు ప్రచారం చేయడం సరికాదని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. తాను వైసీపీలో చేరుతున్నానని, ఆ పార్టీ టికెట్ నుంచి పోటీ చేస్తాననే ఊహాగానాలలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. 

Latest Videos

‘‘శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిని మా పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి ఆహ్వానించడానికి కలిశాను. అక్కడే వైద్య పరీక్షలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన నన్ను ఆహ్వానించారు. ఆ సమావేశంలో నేను వైద్య శిబిరాలు, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించాను. అంతమాత్రాన నేను అధికార పార్టీలో చేరుతున్నానని, వచ్చే ఎన్నికల్లో వారి టిక్కెట్టుపై పోటీ చేస్తానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదు. ఈ ఊహాగానాలలో ఏ మాత్రం నిజం లేదు.. ప్రజలు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఓటర్ల చైతన్య కార్యక్రమం కొనసాగించే నా పోరుబాటకు కట్టుబడి ఉన్నాను’’ అని వీవీ లక్ష్మీనారాయణ ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు  చేశారు. 

ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి శ్రీశైలంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీవీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏపీ సీఎం జగన్‌పై లక్ష్మీ నారాయణ ప్రశంసలు కురిపించారు. విద్యా, వైద్య రంగాల్లో మంచి చేసేవారికి కచ్చితంగా ఫలితాలు కూడా బాగుంటాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పధకాలు చాలా మంచివని ప్రశంసించారు. 

click me!