విజయనగరం రైలు ప్రమాదం.. ఆ తప్పిదమే కారణమా?.. రైల్వే అధికారులు ఏం చెబుతున్నారంటే..

By Sumanth Kanukula  |  First Published Oct 30, 2023, 10:45 AM IST

ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మరణించగా,40 మంది గాయపడినట్టుగా అధికారులు చెబుతున్నారు.


ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. కంటకపల్లి వద్ద పలాస ప్యాసింజర్ రైలు(08532)ను వెనకాల నుంచి విశాఖపట్నం-రాయగడ (08504) రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మరణించగా,40 మంది గాయపడినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సిగ్నల్ లోపం కారణమా, మానవ తప్పిదం కారణమా? అనే చర్చ మొదలైంది. అయితే తాజాగా దీనిపై రైల్వే అధికారుల నుంచి స్పష్టత వచ్చింది.

ఈస్ట్ కోస్ట్ రైల్వేలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ బిశ్వజిత్ సాహు మీడియాతో మాట్లాడుతూ.. మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. విశాఖపట్నం-రాయగడ రైలు లోకో పైలట్ సిగ్నల్ ఓవర్‌షూటింగ్ (రెడ్ సిగ్నల్ వద్ద ఆపకుండా ముందుకు వెళ్లడం) చేయడం వల్ల ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ‘‘విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ రైలు ప్రమాదానికి కారణమైంది. లోకో పైలట్ సిగ్నల్ ఓవర్‌షాట్ చేసి పలాస రైలు వెనుక భాగాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రాయగడ రైలు లోకో పైలట్ కూడా మరణించారు’’ అని బిశ్వజిత్ సాహు చెప్పారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతుందని.. ఆ తర్వాత మాత్రమే కచ్చితమైన వివరాలు తెలుస్తాయని అని అన్నారు. 

Latest Videos

ఇక, ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయక  చర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రానికి ట్రాక్‌పై సహాయక చర్యలు పూర్తయ్యే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా ట్రాక్‌ను పునరుద్దరించి.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకను తిరిగి ప్రారంభించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదిలాఉటే, ఈ ఘటనతో ఇప్పటివరకు 18 రైళ్లను రద్దు చేయగా, మరో 22 రైళ్లను దారి మళ్లించారు.

ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 సహాయం ప్రకటించారు. ‘‘బాధితులకు అధికారులు అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తున్నారు. ప్రధాన మంత్రి మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు’’ అని ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్‌(ట్విట్టర్)లో పేర్కొంది. 

అయితే భారత రైల్వేలో ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదాలు ప్రయాణికులు భద్రతపై ఆందోళనను  రెకేత్తిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఒడిశాలో జరిగిన ఘోర ప్రమాదంలో 280 మంది ప్రయాణికులు మరణించారు. షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఓ గూడ్స్ రైలు జూన్ 2న బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. 
 

click me!