ఏ సినిమాకైనా ఒకే రేటు ఉండాలనేది తమ అభిమతమని ఏపీ సీఎం జగన్ సినీ ప్రముఖులకు తేల్చి చెప్పారు. చిరంజీవి నేతృత్వంలోని బృందం ఇవాళ జగన్ తో తాడేపల్లిలో భేటీ అయింది.
అమరావతి: ఎవరి సినిమాకైనా టికెట్ ధర ఒకే రేటు ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.గురువారం నాడు ఏపీ సీఎం YS Jagan తో Chiranjeevi నేతృత్వంలోని సినీ రంగ ప్రముఖులు తాడేపల్లిలో భేటీ అయ్యారు. అందరికీ న్యాయం జరిగేలా టికెట్ ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. రూ. 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ సినిమాలను ప్రత్యేకంగా చూడాల్సిందేనని సీఎం చెప్పారు. అలా చూడకపోతే భారీ ఖర్చుతో సినిమా చేయడానికి ఎవరూ కూడా ముందుకు రారని సీఎం అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో సినిమా షూటింగ్ లను ప్రమోట్ చేస్తున్నామని జగన్ హామీ ఇచ్చారు. కనీసం 20 శాతం షూటింగ్ లు ఏపీ చేయాలని జగన్ సినీ ప్రముఖులను కోరారు. ఆన్ లైన్ పద్దతిలో టికెట్ల విక్రయం అందరికీ మంచిదని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రతి ఏటా వెయ్యి రూపాయాలకే ఓటీటీలు సినిమాలు ప్రసారం చేస్తున్న విషయాన్ని సీఎం టాలీవుడ్ ప్రముఖుల వద్ద ప్రస్తావించారు. కనీస ఆదాయాలు కూడా రాకపోతే సినిమాలు తీసే పరిస్థితి కూడా తగ్గిపోతోందన్నారు. అయితే దీన్ని సమతుల్యం చేసే విధంగా టికెట్ ధరలను నిర్ణయిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.ప్రేక్షకులకు భారం కాకుండా, పరిశ్రమ నిలబడేలా టికెట్ రేట్లు ఉంటాయని జగన్ తెలిపారు.
ఇప్పటివరకు కొద్ది మందికి ఎక్కువ, కొద్ది మందికి తక్కువ టికెట్ రేట్లు వసూలు చేస్తున్నారని జగన్ గుర్తు చేశారు. దీనిపై తాను చిరంజీవి విస్తృతంగా చర్చించినట్టుగా జగన్ గుర్తు చేశారు. నిర్మాతలకు నష్టం లేకుండా, ప్రేక్షకులకు భారం కాకుండా టికెట్ ధరలు ఉంటాయని జగన్ హామీ ఇచ్చారు. రూ. వంద కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలకు వారం రోజుల పాటు ప్రత్యేక ధరలపై కూడా చర్చించామన్నారు.
హైద్రాబాద్, బెంగుళూరు, చెన్నైలతో పోటీపడే సత్తా విశాఖపట్టణానికి ఉందని జగన్ చెప్పారు. టాలీవుడ్ ను Visakhapatnamకి విస్తరించాలని ఆయన కోరారు. విశాఖను మనది అనుకొని భావించాలన్నారు. విశాఖపట్టణంలో సినిమా స్టూడియోల నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలాలను కూడా ఇస్తోందని జగన్ హామీ ఇచ్చారు. విశాఖను హైద్రాబాద్ జూబ్లీహిల్స్ తరహలో అభివృద్ది చేద్దామని సీఎం జగన్ సినీ ప్రముఖులను కోరారు. ఏదో ఒక రోజు మనమంతా విశాఖపట్టణానికి వెళ్లాల్సిందేనని సీఎం జగన్ చెప్పారు.
రాష్ట్రంలో షూటింగ్‌లు ప్రమోట్ చేయడం కోసం కొంత పర్సెంటేజ్ కేటాయించామన్నారు. ఏపీలో సినిమా షూటింగ్‌లు ప్రమోట్ చేయడం కోసం ఇక్కడే షూటింగ్‌లు జరిపి ఉండాలి అన్న నిబంధనను తీసుకొస్తే షూటింగ్ లు పెరుగుతాయన్నారు. కనీసం ఎంత శాతం షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లో చేయాలన్న దానిపై ఇప్పటికే మంత్రి పేర్ని నాని దర్శకులు, నిర్మాతలతో మాట్లాడిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అందరి అభిప్రాయాలను తీసుకొని కనీసం 20 శాతం షూటింగ్ లు ఏపీలో నిర్వహిస్తామని మంత్రి పేర్ని నాని తనకు చెప్పారని జగన్ వివరించారు.
Telanganaతో పోలిస్తే ఇండస్ట్రీకి ఏపీ నుండే ఎక్కువ కంట్రిబ్యూషన్ ఎక్కువ అని జగన్ చెప్పారు. తెలంగాణ నుండి 40 శాతం ఆదాయం వస్తే ఏపీ నుండి 60 శాతం ఆదాయం వస్తోందన్నారు. హీరోలు, హీరోయిన్లకు ఇచ్చే డబ్బులు కాకుండానే సినిమా ప్రొడక్షన్ కాస్ట్ భారీగా పెరిగిపోతోందన్నారు. భారీ బడ్జెట్ సినిమాలు తీయడంలో రాజమౌళి నిపుణుడని జగన్ ప్రశంసించారు.
మంచి సినిమాలు, పెద్ద సినిమాలు తీయాలని కోరుతూనే చిన్న సినిమాల గురించి సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అదే సమయంలో చిన్న సినిమాలను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. దీనికోసం కార్యాచరణ చేసుకోవాలని కోరుతున్నానని సీఎం జగన్ చెప్పారు. సినిమా క్లిక్ కావాలంటే పండగ రోజు రిలీజ్ చేస్తే హిట్ అవుతుందని అందరికీ తెలుసు. ఇక్కడే చిన్నసినిమాను రక్షించుకోవడానికి కూడా కొంత సమతుల్యత అవసరమన్నారు. పరిశ్రమ నుంచే దీనికి తగిన కార్యాచరణ ఉండాలని కోరుతున్నామని సీఎం చెప్పారు..