జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్.. ఆయన కంపెనీ ఆస్తులను అటాచ్ చేసిన దర్యాప్తు సంస్థ..

By Sumanth KanukulaFirst Published Nov 30, 2022, 12:06 PM IST
Highlights

టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. జేసీ ప్రభాకర్ రెడ్డి కంపెనీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 

టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. జేసీ ప్రభాకర్ రెడ్డి కంపెనీ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆయన అనుచరుడు గోపాల్ రెడ్డి ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. రూ. 22.10 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగినట్టుగా గుర్తించిన ఈడీ.. ఆయన కంపెనీ ఆస్తులను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

సుప్రీం కోర్టు ఉత్తర్వులకు విరుద్దంగా బీఎస్-4 వాహనాలను రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా ఈడీ తెలిపింది. జటధార ఇండస్ట్రీస్, గోపాల్ రెడ్డి అండ్ కో కంపెనీ బీఎస్-4 వాహనాలు కొనుగోలు  చేసిందని పేర్కొంది. అశోక్ లేలాండ్ నుంచి తక్కువ ధరకు వాహనాలు కొనుగోలుచేసినట్టుగా తెలిపింది. ఏపీ, కర్ణాటక, నాగాలాండ్‌లలో నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసినట్టుగా పేర్కొంది. రూ. 38.36 కోట్ల అక్రమ క్రమ, విక్రయ లావాదేవీలను గుర్తించామని తెలిపింది. ఈ వ్యవహారంలో అశోక్ లేలాండ్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. 

ఇక, 2017 ఏప్రిల్ 1 తర్వాత బీఎస్ 3 వాహనాల అమ్మకాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా.. అనేక చట్టాలను ఉల్లంఘించి కొన్ని వాహనాలను విక్రయించారనే ఆరోపణలను జేసీ ప్రభాకర్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే స్క్రాప్‌ వాహనాల కొనుగోలు, అక్రమ రిజిస్ట్రేషన్‌, చట్టాలను ఉల్లంఘించి విక్రయించడంపై ఈడీ అధికారులు ప్రభాకర్ రెడ్డిని గత నెలలో ప్రశ్నించారు. ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. 

ఈ కేసు విషయానికి వస్తే.. ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా.. ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. బీఎస్ 3 ప్రమాణాలు కలిగిన వాహనాలను అక్రమంగా బీఎస్ 4 వాహనాలుగా మార్చుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో.. ప్రభాకర్ రెడ్డి కంపెనీలకు సంబంధించి మనీలాండరింగ్ కోణంలో విచారణ జరుపుతుంది.  

click me!