
నిజాయితీతో ట్రావెల్స్ వ్యాపారాన్ని నడిపానని కేశినేని నాని చెప్పుకున్నది అబద్దమని తెలిపోయింది. రెండు రోజుల క్రితం కేశినేని ట్రావెల్స్ యజమాని, విజయవాడ ఎంపి కేశినేని నాని మాట్లాడుతూ తాను వ్యాపారాన్ని నిజాయితీగా నడిపానని చెప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే. రకరకాల కారణాలతో నాని అర్ధాంతరంగా ట్రావెల్స్ బిజినెస్ నిలిపేసారు. రవాణాశాఖ కమీషనర్ తో బహిరంగంగా జరిగిన వివాదం, తర్వాత చంద్రబాబునాయుడు ఆదేశాలతో క్షమాపణ చెప్పుకోవటం లాంటి వాటితో ట్రావెల్స్ బిజినెస్ ను నాని మూసేసారు. అయితే, మూసివేతకు అనేక ఇతర కారణాలున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది లేండి.
తాజా విషయమేమిటంటే, తమకు ఏడాదిగా నాని జీతాలు చెల్లించటం లేదంటూ సిబ్బంది ఎంపి కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. గతంలో కూడా ఆందోళనకు సిద్ధమైన సిబ్బందిని బ్రతిమలాడి 15వ తేదీకల్లా జీతాల విషయాన్ని సెటిల్ చేస్తామని చెప్పటంతో అప్పట్లో ఆందోళన విరమించుకున్నారు. అయితే, ఎంపి సన్నిహితులు తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవటంతో సిబ్బంది వెంటనే ఆందోళన షురూచేసారు.
ఎంపి చెప్పుకున్నట్లుగా నిజాయితీతో వ్యాపారం చేస్తే మరి సుమారు 500 మందికి ఏడాది నుండి జీతాలు ఎందుకు బకాయిపెట్టినట్లు? అదే విధంగా బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను ఎందుకు చెల్లించటం లేదు? ఒకవైపు సిబ్బందికి జీతాలు చెల్లించక, ఇంకోవైపు బ్యాంకులకు రుణాలు చెల్లించకుండానే తాను వ్యాపారాలను నిజాయితీతో నిర్వహిస్తున్నట్లు చెప్పుకోవటం కేశినేని నానికే చెల్లింది. అంటే ఇప్పటికే బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగొట్టిన నేతలే నానికి ఆదర్శమైనట్లు కనబడుతోంది. తమకు ట్రావెల్స్ యాజమాన్యం సుమారు రూ. 6 కోట్లు బకాయిలున్నట్లు సిబ్బంది ఆరోపణలు చేస్తుండటం గమనార్హం.