
‘అందితే జుట్టు అందకపోతే కాళ్ళు’ అన్నట్లుంది చంద్రబాబునాయుడు వ్యవహారం. చిత్తూరు ఎంపి శివప్రసాద్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రెండు రోజుల క్రితం హూంకరించిన చంద్రబాబు తర్వాత రాయబారాలు పంపుతున్నారు. తనపైనే నేరుగా ఆరోపణలు చేసిన ఎంపిపై చర్యలు తసుకోకపోతే ముందుముందు చాలా సమస్యలు వస్తాయన్నది చంద్రబాబు ఆలోచన. నిజమే, మరి తీసుకునే చర్యలేవో వెంటనే ఎందుకు తీసుకోలేదు? అంటే ఇక్కడ మళ్లీ ఎంపి సామాజిక వర్గం అడ్డని ఆలోచిస్తున్నారట.
ఎంపిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే, తాను దళితుడిని కాబట్టే తనపై అంత వేగంగా చర్యలు తీసుకున్నారంటూ ఎంపి మళ్ళీ రచ్చ చేస్తారని అనుమానం. అదే సమయంలో చర్యలు తసుకోకపోతే భవిష్యత్తులో మరింత రెచ్చిపోతారేమనని కూడా అనుమానిస్తున్నారట. ఎంతటి సమస్య వచ్చింది చంద్రబాబుకు. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా తనపై నేరుగా ఆరోపణలు చేసిన వారిలో ఎవరిపైనా చర్యలు తీసుకోలేని చంద్రబాబు ఇపుడు ఎంపిపై మాత్రం ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? చంద్రబాబు మనసు తెలుసుకున్నారు కాబట్టే జిల్లాలోని నేతలెవరూ ఎంపి విషయాన్ని పట్టించుకోవటం లేదు.
చర్యలు తీసుకోవటం సాధ్యం కాదని అనుకున్నపుడు ముందుగానే ఎంపిని పిలిపించి బుజ్జగించాల్సింది. కానీ ఆపని చేయలేదు. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో శివప్రసాద్ కు టిక్కెట్ ఇవ్వదలుచుకోలేదట. ఇప్పటికే ప్రత్యామ్నాయం కూడా చూసుకున్నారట. ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆవుల దామోదర్ పేరు వినబడుతోంది. అంటే శివప్రసాద్ పార్టీలో ఉన్నా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే అన్న అంచనాకు చంద్రబాబు వచ్చారని సమాచారం. అందుకే ఇంతకాలం పట్టించుకోలేదు. మరి వెంటనే ఎంపిపై చర్యలు తీసుకుని బయటకు పంపేస్తే సరిపోతుంది. కానీ ఎంపిని సముదాయించమని కేంద్రమంత్రి సుజనాచౌదరిని ఎందుకు పంపుతున్నట్లో?