ఏలూరులో అంతు చిక్కని వ్యాధి: జగన్ కు చంద్రబాబు లేఖ

By telugu teamFirst Published Dec 9, 2020, 9:37 AM IST
Highlights

ఏలూరు వింత వ్యాధిపై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. ఏలూరులో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ చంద్రబాబు జగన్ కు సూచనలు చేశారు.

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఘటనపై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు ఆ లేఖలో సూచనలు చేశారు.  ఏలూరులో జనజీవనం అల్లకల్లోలం కావడం ఆందోళన కలిస్తోందని, గత ఐదు రోజులుగా ఒకరు మరణించడం, ఆరేడు వందల మంది ఆస్పత్రిలు పాలు కావడం విషాదకరమని ఆయన అన్నారు. 

రోజుకో రీతిలో రోగుల్లో లక్షణాలు మారిపోవడంపై భయాందోళనలు నెలకొన్నాయని ఆయన అన్నారు. బాధితులకే కాదు, వారికి సేవలు అంందికి సిబ్బందికి కూడా అవే లక్షణాలు సోకి తల్లడిల్లడం ఈ ఉపద్రవం తీవ్రతకు నిదర్శనమని అన్నారు. కోలుకుని ఇంటికెల్లిన కొందరిలో మళ్లీ అవే లక్షణాలు కనబడడం ఆందోళనకరమని ఆయన అన్నారు. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడం, కారణాలు తెలియకపోవడం, వింత వ్యాధిగా, అంతు పట్టని రోగంగా ప్రచారాలోతో ఏలూరు నగరంతో పాటు పరిసరలా ప్రజలు కూడా భీతిల్లుతున్నారని ఆయన అన్నారు.

సురక్షితమైన తాగునీరు పొందడం ప్రజల పౌర హక్కు, ప్రాణాధారమైన తాగునీటిని ప్రజలకు అందించడం ప్రభుత్వ కర్తవ్యమని ఆయన అన్నారు. సురక్షితమైన తాగునీటిని పొందడం జీవించే హక్కులో అంతర్భాగమని, నీటిని పొందే హక్కుల పౌరుల ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పేర్కొనడమే కాకుండా భారత రాజ్యాంగం ఆర్టికల్ 21కూడా దాన్నే నిర్దేశించిందని, అలాంటిది ఏలూరులో సురక్షిత నీటి సరఫరాలో, పారిశుద్ధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడం శోచనీయమని చంద్రబాబు అన్నారు. 

సాధారంగా ఇలాంటి దుర్ఘటనలు ఎప్పుడు జరిగినా ప్రభుత్వం నుంచి యుద్ధప్రాతిపదికన ఉపశమన చర్యలను,, సహాయక చర్యలను ప్రజలు ఆశిస్తారని, కానీ ఏలూరులో గానీ, పరిసర ప్రాంత్లాల్లో గానీ ఆ దిశగా చర్యలు లేకపోవడం విషాదకరమని ఆయన అన్నారు. 

ఏలూరు దుర్ఘటనలకు కారణాలు ఏమిటి, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాలపై అన్వేషణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.  ఈ దుర్ఘటనకు మూలు నీరే అయితే ఎక్కడ, ఎలా కలుషితమైందో వెంటనే గుర్తించాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు చేపట్టిన పరీక్షల వివరాలను ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు తద్వారా ప్రజల్లో నమ్మకం పెంచాలని, వారి విశ్వాసం పొందాలని, ప్రజలందరికీ ధైర్యం చెప్పాలని చంద్రబాబు అన్నారు. 

బాధితులకు తక్షణ ఉపశమన చర్యలతో పాటు అత్యున్నత వైద్యసాయం అందించానని, భవిష్యత్తులో సైడ్ ఎపెక్ట్స్ లేకుండా చూడాలని ఆయన అన్నారు. ఏలూరు నగరంలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని తక్షణమే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు 

తాగునీటిలో లెడ్, నికెల్ ఉన్నాయనే సమాచారంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని అంటూ లెడ్, నికెల్ వంటి భార లోహాలుంటే గర్భిణులు, చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు. ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులను, అందజేయడం ద్వారా దీర్షకాలిక ప్రాతిపదికపై ప్రతి రోగిని నిశితంగా పరిశ్యవేక్షించాలని ఆయన సూచించారు 

వారం రోజులుగా వరుస కేసులు నమోదవుతున్నా, వందలాది మంది మూర్ఛ లక్షణాలతో సొమ్మసిల్లి పడిపోతున్నా ఇంతవరకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి రాకపోవడం మరో వైఫల్యమని ఆయన విమర్శించారు తక్షణమే బాధితుల కోసం ప్రత్యేకమైన కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏలూరు నగరంలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ ఎక్కడికక్కడ క్విక్ రెస్పాన్ టీములను ఏర్పాటు చేసి, సత్వర ఉపశమన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. 

click me!