వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా కుదరదు .. జగన్‌కు ఎన్నికల సంఘం షాక్

By Siva KodatiFirst Published Sep 21, 2022, 7:31 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని వెల్లడించింది. దీనిపై విచారణ జరిపి తమకు నివేదికను సమర్పించాల్సిందిగా వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఏ రాజకీయ పార్టీకీ శాశ్వత అధ్యక్షుడు వుండడని ఈసీ వెల్లడించింది. దీనిపై విచారణ జరిపి తమకు నివేదికను సమర్పించాల్సిందిగా వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నికైనట్లుగా మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని ఈసీ ఈ మేరకు స్పందించింది. ఏ పార్టీకి అయినా ఎప్పటికప్పుడు ఎన్నికలు జరగాలని, శాశ్వత అధ్యక్షుడు వంటి పదవులు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఈసీ పేర్కొంది. దీనిపై పలుమార్లు లేఖ రాసినా వైసీపీ పట్టించుకోలేదని ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది. ఈసీ నియామవళికి అనుగుణంగానే దేశంలో రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయని ఈసీ వెల్లడించింది. శాశ్వత అధ్యక్షుడి నియామకం చెల్లదని స్పష్టం చేసింది. 

కాగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు ఈ ఏడాది జూలైలో జరిగిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో వైసీపీ ప్లీనరీ నిర్వహించారు. రెండు రోజుల పాటు సాగిన ప్లీనరీలో.. పలు తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు. అయితే తొలి రోజే పార్టీ గౌరవ అధ్యక్ష పదివి నుంచి తప్పుకుంటున్నట్టుగా వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మి ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్లీనరీలో పార్టీ రాజ్యాంగానికి సవరణలు కూడా చేశారు. పార్టీ అధ్యక్ష పదవిని.. జీవితకాల అధ్యక్ష పదవిగా మార్చారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా ఉన్న పేరును.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP)గా మార్చుతూ సవరణ చేశారు.

Also REad:ముగిసిన వైసీపీ ప్లీనరీ.. ఎన్నికలపై క్యాడర్‌కు జగన్ ఏం సూచనలు చేశారంటే..?

వైఎస్ జగన్‌ను పార్టీ జీవితాకాల అధ్యక్షుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటన చేశారు. అనంతరం ప్రసంగించిన జగన్.. 13 ఏళ్లలో తాను సాగించిన ప్రయాణం గురించి ప్రస్తావించారు. తనపై ఎన్నో కుట్రలు చేశారని.. కానీ దేవుడు గొప్ప స్క్రిప్ట్ రాశారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల కుట్రలు చేస్తున్నాయని.. దుష్టచతుష్టయం అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి వివరించారు. 

click me!