
ఎన్నికలకు ముందు జనసేన పార్టీకి ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. గాజు గ్లాసు గుర్తును మరోసారి జనసేనకే కేటాయించింది. దీంతో జనసేన కేడర్ సంబరాలు చేసుకుంటోంది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
గతంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒక్కరు తప్పించి మిగిలిన వారంతా ఓటమి పాలయ్యారు. దీంతో నిబంధనల ప్రకారం గాజు గ్లాసు గుర్తును రద్దు చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జనసేన శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. త్వరలో ఏపీ , తెలంగాణ , సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో గాజు గ్లాసు గుర్తు విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. తమ పార్టీకి గాజు గ్లాసును కేటాయించాలని ఈసీకి విజ్ఞప్తి చేసింది. దీనికి సానుకూలంగా స్పందించిన ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయించింది.